ఏలూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
ఏలూరు టౌన్:ఏలూరు జిల్లా కోర్టులో ఆర్‌డీఎక్స్ ఐఈడీ బాంబ్ పెట్టామని, రిమోట్‌తో పేల్చివేస్తామని గుర్తుతెలియని దుండగులు పంపిన మెయిల్‌తో ఒక్కసారిగా కలకలం రేగింది. గురువారం మఽ ద్యాహ్నం 1.30 గంటల సమయంలో కోర్టు ఏఓకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి అవుట్‌లుక్ మెయిల్‌లో ఈ సమాచారం రావడంతో కక్షిదారులు, లాయర్లు పరుగులు పెట్టారు. జిల్లా జడ్జి ఫిర్యాదుతో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ రంగంలోకి దిగారు. జిల్లా కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించి సుమారు 2 గంటలకు పైగా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేయించారు.
ఎల్‌టీటీఈ అంటూ..
తాము ఎల్‌టీటీఈ, ఐఎస్ కేపీ సభ్యులమని, సంయుక్తంగా ఈ సమాచారాన్ని పంపించామని, మూడు ఆర్‌డీఎక్స్ ఐఈడీ బాంబ్‌ల ను ఏర్పాటు చేశామని, 100 మీటర్ల దూరం నుంచి రిమోట్‌తో పేల్చివేస్తామనేది మెయిల్ సారాంశం.
జల్లెడ పట్టిన పోలీసులు : డీఎస్పీ శ్రావణ్‌కుమార్ తక్షణమే కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. సీఐలు కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, అశోక్‌కుమార్‌తో పాటు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ప్రాంగణం, గదులు, చాంబర్లు ఇలా అన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చివరికి ఎక్కడా ఆర్‌డీఎక్స్ ఐఈడీ బాంబులు ఏవీ లేవని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


