పీపీపీ ఉత్తర్వులను భోగి మంటల్లో తగులబెట్టండి
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యను ప్రైవేటీకరించే విధంగా పీపీపీ విధానంలో వైద్య కళాశాల లను ప్రైవేటీకరణ చేసే ఉత్తర్వుల కాపీలను, వికసిత్ భారత్ జీ రాం జి కాపీలను భోగి మంటలలో వేసి తగలబెట్టి నిరసన తెలపాలని సీపీఐ కార్యకర్తలకు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవన్‌లో బాడిశ రాము అధ్యక్షతన శుక్రవారం సీపీఐ జిల్లా కార్యవర్గ విస్తృత సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అక్కినేని వనజ మాట్లాడుతూ 2024 ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలలో పేద ప్రజలకు పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాదని ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదని ఆమె పేర్కొన్నారు. నిరుద్యోగులకు సంబంధించి ఉపాధి కల్పిస్తామని, ఉపాధి కల్పించని పక్షంలో ప్రతి నిరుద్యోగికి నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఏమైందో? అర్థం కావట్లేదని ఆమె రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఈ నెల 18న ఖమ్మంలో జరుగుతున్న సీపీఐ శతాబ్ది ఉత్సవాలు ముగింపు సభకు జిల్లా నుండి 3000 మంది వెళ్లాలని నిర్ణయించామన్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వనజ మాట్లాడుతూ జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్లకు డిజైన్ చేశారని, మొదటి దశగా డ్యాం 41.15 మీటర్ల ఎత్తు వరకు, రెండవ దశగా 45.72 మీటర్లుగా నిర్ణయిస్తూ ప్రాజెక్టును పూర్తిగా రిజర్వాయర్ గా మార్చే కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. సర్వస్వం కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించడంలోనూ పునరావాసం కల్పించడంలోనూ కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని ధ్వజమెత్తారు. సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు కారం ధారయ్య, ఉప్పులూరి హేమ శంకర్, నిమ్మగడ్డ నరసింహ, జేవి రమణ రాజు, తొర్లపాటి బాబు, రెడ్డి శ్రీనివాస్ డాంగే, సిపిఐ నాయకులు టీవీఎస్ రాజు, బి.ఎన్.సాగర్, గోలిమే బాల యేసు పాల్గొన్నారు.


