రొయ్యలు అధరహో | - | Sakshi
Sakshi News home page

రొయ్యలు అధరహో

Jan 10 2026 7:17 AM | Updated on Jan 10 2026 7:17 AM

రొయ్య

రొయ్యలు అధరహో

● రొయ్య ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి

ప్రస్తుత వనామీ రొయ్య ధరలు

ధరల నియంత్రణపై పట్టించుకోని ప్రభుత్వం

గత నెల రోజుల్లో భారీగా పెరిగిన ధరలు

మార్కెట్‌లో 50 కౌంట్‌ రూ. 360

వర్షాకాలం, శీతాకాలంలో వైరస్‌లు వచ్చి రొయ్యల చచ్చిపోతాయి. ఆ సమయంలో అమాంతం రొయ్య ధరలు పెంచేస్తారు. ధరలు పెరిగాయని అప్పులు చేసి రొయ్యల పెంపకం చేస్తే వైరస్‌లకు పిల్ల సైజులోనే రొయ్యలు చచ్చిపోయి నష్టపోతాం. ఫ్రిబ్రవరి నుంచి రొయ్యల ధరలు తగ్గిపోతాయి. ఒక్కోసారి మే, జూన్‌ నెలల్లో ఐస్‌ లేదని రొయ్యలను వ్యాపారస్తులు కొనుగోలు చేయరు. చంద్రబాబు సర్కారు ఫీడ్‌ ధరలు తగ్గించి, నాణ్యమైన సీడ్‌ అందించడంతోపాటు విద్యుత్‌ సబ్సిడీ ఇచ్చి రొయ్య రైతులను ఆదుకోవాలి.

– పెనుమాల నరసింహస్వామి, రొయ్య రైతు, గొల్లవానితిప్ప

భీమవరం అర్బన్‌: ఆక్వా రాజధానిగా ఉన్న భీమవరం ప్రాంతంలో తక్కువ సమయంలో వనామీ రొయ్య పెంపకం సిరులు కురిపించడంతో రొయ్యసాగుకు రైతులు మొగ్గు చూపుతుతున్నారు. అయితే శీతాకాలంలో రొయ్యలకు సోకే వైట్‌ స్పాట్‌, విబ్రియో, వైట్‌గడ్‌ లాంటి వ్యాధులు రైతులను నష్టాల బాట పట్టిస్తున్నాయి. దీంతో పట్టుబడికి వచ్చిన రొయ్యలు ఎక్కువ లేకపోవడంతో రొయ్యల ధరలకు రెక్కలొస్తున్నాయి. భీమవరం మండలంలోని కొత్తపూసలమర్రు, దొంగపిండి, లోసరి, వెంప, పెదగరువు, ఎల్‌వీఎన్‌పురం, కొమరాడ, అనాకోడేరు, తోకతిప్ప, నాగిడిపాలెం, దెయ్యాలతిప్ప తదితర గ్రామాల్లో సుమారు 8 వేల ఎకరాల్లో వనామీ పెంపకం సాగిస్తున్నారు. వీటిపై రొయ్య రైతులు, రొయ్య వ్యాపారస్తులు వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. గత వర్షాకాలం నుంచి రొయ్యల సాగుకు ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో వైరస్‌ బారిన పడి రొయ్యలు మృత్యువాత పడటం, మోంథా తుపాను ధాటికి కొన్ని చోట్ల రొయ్యల చెరువు గట్లు గండ్లు పడటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న ఎంతోమంది కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. పట్టుబడికి వచ్చిన రొయ్యలు తక్కువ శాతం ఉండటంతో రొయ్యల ధరలు పెరిగాయని రైతులు చెబుతున్నారు.

సిండికేట్‌తో తక్కువ ధరలు

వర్షాకాలం, శీతాకాలంలో వనామీ రొయ్యల సాగుకు ప్రతికూల వాతావరణం కావడంతో వాటికి వైరస్‌, విబ్రియో, ఈహెచ్‌పీ, వైట్‌గట్‌ తదితర వ్యాధులు సోకి మృత్యువాత పడతాయి. ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు రొయ్యల పెంపకానికి వాతావరణం అనుకూలం కావడంతో ఎక్కువ మంది రైతులు రొయ్యలను పెంపకం సాగిస్తుంటారు. ఆ సమయంలో రొయ్యలను వ్యాపారస్తులు సిండికేట్‌గా ఏర్పడి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తారన్న విమర్శలు ఉన్నాయి.

పెరిగిపోయిన ఫీడ్‌, సీడ్‌ ధరలు

చంద్రబాబు సర్కార్‌ అధికారం చేపట్టినాటి నుంచి ఫీడ్‌ ధరలు తగ్గించకపోవడం, నాణ్యమైన సీడ్‌ అందివ్వకపోవడం, నామమాత్రంగా రైతులకు విద్యుత్‌ సబ్సిడీ అందివ్వడం, మరోపక్క లేబర్‌ చార్జీలు, రొయ్యలకు వాడే మెడిసిన్‌ ధరలు పెరగడంతో ప్రతిసారి రొయ్యల పెంపకంలో నష్టాలు రావడంతో రైతులు పెంపకం చేసేందుకు అనాశక్తి చూపుతున్నారు.

రొయ్యల పెంపకంపై మత్స్యశాఖ చిన్నచూపు

విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా జిల్లాకు చేర్చే రొయ్యల పెంపకాన్ని మత్స్యశాఖ అధికారులు చిన్నచూపు చూస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలామంది రైతులకు రొయ్యల పెంపకంలో మెళుకువలు తెలియదు. దీంతో లక్షలు పెట్టుబడులు పెట్టి తరచూ నష్టాల్ని చూస్తున్నామని చెబుతున్నారు. మత్స్యశాఖాధికారులు రొయ్యల దిగుబడులపై అవగాహన సదస్సులు, పొలం పిలుస్తోంది కార్యక్రమాలు చేయడం లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.

పట్టుబడికి వచ్చిన కేజీ 20 కౌంట్‌ రూ.540, 25 కౌంట్‌ రూ. 500, 30 కౌంట్‌ రూ. 460, 40 కౌంట్‌ రూ. 390, 45 కౌంట్‌ రూ..370, 50 కౌంట్‌ రూ. 360, 60 కౌంట్‌ రూ. 340, 70 కౌంట్‌ రూ.320, 80 కౌంట్‌ రూ.290, 90 కౌంట్‌ రూ.275, 100 కౌంట్‌ రూ.255 ఉన్నాయి. ఈ రొయ్య ధరలు ప్రాంతాన్ని బట్టి, ఎక్కువ టన్నేజిని బట్టి రూ. 30 నుంచి 50 మారుతాయని రొయ్య వ్యాపారస్తులు చెబుతున్నారు.

డాలర్ల పంటగా పేరొందిన ఆక్వా రంగంపై చంద్రబాబు సర్కార్‌ పట్టించుకోకపోవడంతో ఆక్వా రంగం ఏడాదికేడాది కుదేలవుతోంది. రొయ్య ధరల నియంత్రణపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో వ్యాపారస్తులు చెప్పిన ధరలకు రొయ్యలను అమ్ముకుని నష్టాలపాలవుతున్నామని రైతులు వాపోతున్నారు. ఈ బాధ తట్టుకోలేక కొందరు రైతులు రొయ్యల పెంపకానికి స్వస్తి పలుకుతున్నారు.

రొయ్యలు అధరహో 1
1/1

రొయ్యలు అధరహో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement