అంతర్ జిల్లా దొంగల అరెస్టు
ఏలూరు టౌన్: ఏలూరు నగరానికి చెందిన ఇద్దరు స్నేహితులు సులువుగా డబ్బు సంపాదనే లక్ష్యంగా ఉమ్మడి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోటారు సైకిళ్లను చోరీ చేస్తున్నారు. ఏడాది కాలంలో ఏకంగా 50 మోటారు సైకిళ్ళు చోరీ చేస్తూ చివరికి ఏలూరు త్రీటౌన్ పోలీసులకు చిక్కారు. వీరితో పాటు మరో 14 మంది రిసీవర్లను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి, కేసులు వివరాలు వెల్లడించారు. ఏలూరు తూర్పువీధి గౌరమ్మగుడి ప్రాంతానికి చెందిన మహ్మద్ షాకీర్ ప్రస్తుతం ద్వారకాతిరుమల మండలం గుండుగొలనుకుంట గ్రామంలో నివాసం ఉంటున్నాడు. షాకీర్ మోటారు మెకానిక్‌గా పని చేస్తూ ఉంటాడు. ఏలూరు సుంకరవారితోట, కనకదుర్గమ్మ గుడి ఎదురుగా నివాసం ఉంటోన్న గోపిశెట్టి సురేష్ నగరంలో గోద్రెజ్ కంపెనీ సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసలుగా మారి ఈజీ మనీకి అలవాటుపడ్డారు. మెకానిక్ షాకీర్, సురేష్ ఇద్దరూ ఆయా ప్రాంతాల్లో మోటారు సైకిళ్ళు పార్కింగ్ చేసి ఉండటాన్ని ముందుగా గమనించి స్కెచ్ వేస్తారు. షాకీర్ వేరే తాళంతో మోటారు సైకిల్‌ను చోరీ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా సురేష్ ఎవరైనా వస్తున్నారా అనేది గమనిస్తూ ఉంటాడు. అనంతరం ఇద్దరూ మోటారు సైకిళ్ళను ఇతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటారు. వీరిద్దరూ ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఏడాదిలో సుమారుగా 50 మోటారు సైకిళ్ళు చోరీ చేయగా, వీటి విలువ సుమారు రూ.25లక్షలు ఉంటుందని పోలీస్ అధికారుల అంచనా.
కేసును ఛేదించింది ఇలా
గత ఏడాది డిసెంబర్ 1న ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దుగ్గిరాల గ్రామం జోసెఫ్‌నగర్‌లోని ఒక ఇంటి గ్రిల్, తాళాలు పగులగొట్టి లోపల ఉన్న హీరో ప్యాషన్ ప్రో మోటారు సైకిల్ చోరీకి గురైంది. ఈ చోరీపై కొరగంటి ప్రభాకర్ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై పి.రాంబాబు దర్యాప్తు చేపట్టి చాకచక్యంగా ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు. విచారణ చేపట్టగా నిందితులు ఇద్దరూ ఏకంగా 50కిపైగా మోటారు సైకిళ్ల చోరీ చేసినట్లు గుర్తించారు. వీరిద్దరి నుంచి 50మోటారు సైకిళ్ళను త్రీటౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే టి.నరసాపురం మండలానికి చెందిన చోరీ సొత్తు రిసీవర్లు 14 మందిని పోలీసులు గుర్తించి వీరిపైనా కేసు నమోదు చేశారు. ఈ కేసు ఛేదించటంలో ప్రతిభ చూపిన త్రీటౌన్ ఎస్‌ఐ రాంబాబు, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.


