పీజీఆర్‌ఎస్ పరిహాసం
వేలల్లో దరఖాస్తులు
తన స్థలంలో నిర్మాణంలోని షెడ్డు, నిర్మాణ సామగ్రిని ఆక్రమణ పేరిట పంచాయతీ కార్యదర్శి, కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారంటూ ఒక వ్యక్తి మండల స్థాయి పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన అధికారి సామగ్రిని ధ్వంసం చేయడంలో పంచాయతీ సిబ్బంది ప్రమేయం లేదని తన అర్జీని క్లోజ్ చేశారని, దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌లో మళ్లీ ఫిర్యాదు చేశారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తన భూమిని అక్రమంగా వేరొకరి పేరిట చేసిన రిజిస్ట్రేషన్‌ను రద్దుచేయాలని కోరుతూ ఒక యువకుడు గత ఏడాది పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదుచేశారు. సమస్యను పరిష్కరించి ఎస్సై చేతుల మీదుగా తనకు ఎండార్స్‌మెంట్ ఇచ్చినట్టు పీజీఆర్‌ఎస్ సైట్‌లో అధికారులు ఫేక్ ఫొటో అప్‌లోడ్ చేసి తన అర్జీని క్లోజ్ చేయగా రీ ఓపెన్ చేయించినట్టు అప్పట్లో ఆయన మీడియా దృష్టికి తెచ్చారు.
సాక్షి, భీమవరం: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలుచేసింది. ప్రజల నుంచి వచ్చిన వినతులను ఎప్పటికప్పుడు నిర్ణీత గడువులోగా పరిష్కరించడం ద్వారా కార్యక్రమం పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. స్పందన సక్రమంగా అమలు జరిగేలా రాష్ట్ర స్థాయిలో మానిటరింగ్ చేసేందుకు అప్పట్లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు.
కూటమి ప్రభుత్వం స్పందన పేరును ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)గా మార్పుచేసింది. పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, గృహనిర్మాణ సాయం మంజూరు తదితర ప్రభుత్వ పథకాలు, కుటుంబ తగాదాలు, ప్రభుత్వ భూములు ఆక్రమణలు, తాగునీరు, విద్యుత్ సమస్యలు, సరిహద్దు వివాదాలు, భూ సర్వే తదితర అంశాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఆయా సమస్యలను హై ప్రయారిటీ, కాజువల్ ప్రయారిటీ, మిడివల్, ఫైనాన్సియల్, నాన్ ఫైనాన్సియల్‌గా విభజించి వాటి ప్రాధాన్య మేరకు 48 గంటల నుంచి నిర్ణీత వ్యవధిలో పరిష్కారం చూపాల్సి ఉంటుంది. అనంతరం దరఖాస్తుదారుని సమస్య పరిష్కారం అయినట్టుగా ఎండార్స్‌మెంట్ తీసుకుని ఆ ఫొటోను సైట్‌లో అప్‌లోడ్ చేసి అర్జీని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. కలెక్టర్ సీహెచ్ నాగరాణి పీజీఆర్‌ఎస్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. పీజీఆర్‌ఎస్ హాలు నుంచి నడవలేని వారు, దివ్యాంగుల చెంతకు వచ్చి అర్జీలు స్వీకరిస్తున్నారు. వాటి పరిష్కార ప్రగతిపై ప్రతి వారం ఆయా శాఖల అధికారులతో సమీక్షిస్తున్నారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చేవారికి దాతల సహకారంతో మధ్యాహ్న సమయంలో ఉచిత భోజన వసతి కల్పిస్తున్నారు. కిందిస్థాయిలో కొందరు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సమస్యకు సకాలంలో పరిష్కారం చూపకుంటే జవాబుదారీ కావాల్సి వస్తుందని ఏదోవిధంగా వాటిని క్లోజ్ చేస్తున్నారంటున్నారు. అలాంటి సందర్భాల్లో కొందరు అర్జీదారులు సమస్య పరిష్కారం కోసం తమ ఫిర్యాదులను రీ ఓపెన్ చేస్తున్నారు.
గత ఏడాది పీజీఆర్‌ఎస్‌కు దాదాపు 43,100 దరఖాస్తులు రాగా వాటిలో 50 శాతం వరకు రెవెన్యూ, సర్వే పరమైన సమస్యలే ఉన్నాయి, మిగిలిన వాటిలో పంచాయతీరాజ్, పోలీస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యుత్, తాగునీరు, రిజిస్ట్రేషన్ తదితర శాఖలకు చెందిన అర్జీలు వచ్చాయి. 32,802 అర్జీలను పరిష్కరించగా, 7,554 అర్జీలను పరిష్కరించాల్సి ఉంది. పెండింగ్‌లో ఉన్న వాటిలోను అధికంగా రెవెన్యూ పరమైనవి ఉంటున్నాయి. పరిష్కారం అయిపోయినట్టు క్లోజ్ చేసిన వాటిలో రీ ఓపెన్ చేసి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు 342 వరకు ఉన్నాయి. వీటిలో 80 శాతం వరకు రెవెన్యూ, సర్వే పరమైనవి కాగా మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి. పరిష్కారం సంతృప్తికరంగా లేని పక్షంలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
సంతృప్తికర సమాధానం లేకుండా పలు అర్జీలు క్లోజ్
రీ ఓపెన్ చేయిస్తున్న దరఖాస్తుదారులు
ప్రస్తుతం రీఓపెన్ అయ్యి పెండింగ్‌లో ఉన్న అర్జీలు 342
గతేడాది మొత్తం అర్జీలు 43,100, పరిష్కరించినవి 32,802, పెండింగ్‌లో 7,554


