కాయ్‌ రాజా కాయ్‌! | - | Sakshi
Sakshi News home page

కాయ్‌ రాజా కాయ్‌!

Jan 8 2026 9:35 AM | Updated on Jan 8 2026 9:35 AM

కాయ్‌ రాజా కాయ్‌!

కాయ్‌ రాజా కాయ్‌!

జూదమే ఆదాయం

సాక్షి ప్రతినిధి,ఏలూరు: సంక్రాంతి జూద క్రీడకు సర్వం సన్నద్ధమైంది. కోడి పందేల బరుల్లో ప్రత్యేకంగా పేకాట శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తూ ముందుగానే శిబిరాలను ఖరారు చేసి విక్రయించడానికి వీలుగా అడ్వాన్సులు తీసుకుంటున్నారు. చిన్నపాటి బరుల్లో లక్షతో మొదలై భారీ బరుల్లో కోటిన్నర వరకు ధరకు జూదక్రీడలను ముందుగానే విక్రయిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో కోడిపందాల బరుల్లో భారీగా పేకాట శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా వంద కోట్లపైన కోడిపందేలు జరిగే అవకాశం ఉండగా.. దానికి రెట్టింపు స్థాయిలో జూదక్రీడలు ఉండటం విశేషం.

ఉమ్మడి పశ్చిమలో కోడి పందేల బరులు సిద్ధమవుతున్నాయి. మినీ స్టేడియాలను తలపించేలా అట్టహాసంగా ఏర్పాట్లు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ప్రారంభమయ్యాయి. ప్రధానంగా ఉండి, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెంలోని అత్యధికంగా కోడిపందేల బరులు ఏర్పాటవుతుండగా కై కలూరు, పోలవరం, దెందులూరులో భారీగా ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో చిన్నపాటి బరి నుంచి రూ.30 లక్షల వరకు పందేలు నిర్వహించే స్థాయిలో బరులు ఏర్పాటు చేస్తున్నారు. సంప్రదాయ కోడి పందేల ముసుగులో కత్తులు కట్టి నిషేధిత కోడిపందాలు యథేచ్ఛగా ఒకవైపు నిర్వహించడానికి వీలుగా ఏర్పాటు చేస్తుంటే మరోవైపు పూర్తిగా నిషేధమైన జూదక్రీడలను భారీగా కొనసాగించేలా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

ముందస్తుగానే అమ్మకాలు

పేకాటలో కోత ముక్క, లోన బయట, గుండాట శిబిరాలను ప్రతి బరిలో వేర్వేరుగా ఏర్పాటు చేస్తుంటారు. ముందస్తుగానే బరి రద్దీ, స్థాయి ఏర్పాటైన ప్రదేశాన్ని బట్టి ధరలను నిర్ణయిస్తుంటారు. భారీ బరుల్లో మూడు కలిపి రూ.50 నుంచి రూ.70 లక్షల ధరకు విక్రయిస్తుంటారు. వీటిలో నిర్వాహకులకు గుండాటలో అత్యధిక లాభాలు వస్తుంటాయి. భీమవరంలోని గొల్లవానితిప్ప, ఉండిలోని ఉండి, తాడేపల్లిగూడెం, దెందులూరు మండలంలో దుగ్గిరాల, చింతలపూడి, పాలకొల్లు, నర్సాపురం ఇలా ప్రధాన ప్రాంతాల్లో రూ.50 లక్షల నుండి రూ.5 కోట్ల స్థాయి పందేలు నిర్వహించే చోట అత్యధికంగా రూ.70 లక్షల ధరకు పేకాట శిబిరాలు విక్రయిస్తున్నారు. భీమవరం సమీపంలోని ఒక బరిలో గుండాటకు రూ.70 లక్షలు, పేకాటకు రూ.40 లక్షలు, కోతాటకు రూ.30 లక్షలు అడ్వాన్సులు తీసుకున్నట్లు సమాచారం.

కోడి పందేల నిర్వాహకులకు జూద క్రీడలే ప్రధాన ఆదాయం. ఉదాహరణకు... కోటి రూపాయలు పందేలు జరిగే బరిలో మూడు రోజుల మీద 30 పందేలు నిర్వహిస్తే రూ.30 కోట్లు కోడి పందేలు జరిగితే అదే శిబిరంలో జూదక్రీడలు రూ.30 నుంచి రూ.40 కోట్ల స్థాయిలో జరుగుతుంటాయి. వాటిని ముందుగానే విక్రయించి సుమారు రూ.కోటి మేర నిర్వాహకులు వసూలు చేస్తారు. ప్రతి కోడి పందెంలో కోటికి రూ.10 లక్షల చొప్పున మెయింటెనెన్స్‌కు వసూలు చేస్తుంటారు. అతిథులకు భోజనాలు, బరి ఏర్పాట్లు, నిర్వహణ ఇలా అన్ని ఖర్చులు తీసి మిగిలింది నిర్వాహకుడి ఖాతాలో వేసుకుంటారు. ప్రస్తుతం జిల్లాలో తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకులో అత్యధిక ధరకు పేకాట శిబిరాలు అమ్ముడైనట్లు సమాచారం.

పందెం బరుల్లో పేకాటకు భారీ డిమాండ్‌

అత్యధిక బరుల్లో ముందే పేకాట శిబిరాల అమ్మకం

బరి స్థాయిని బట్టి ధరల నిర్ణయం

చిన్న బరుల్లో రూ.లక్ష నుంచి రూ.15 లక్షల వరకు అమ్మకం

గుండాటలో నిర్వాహకులకు భారీగా మిగులు

కోడిపందేలను మించి పేకాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement