కోడి పందేలకు సన్నద్ధం
ఉమ్మడి జిల్లాలో భారీగా..
దుగ్గిరాలలో సిద్ధం చేస్తున్న బరి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కోడి పందేలకు సర్వం స న్నద్ధమైంది. హైకోర్టు నిషేధాజ్ఞలు.. నూరు శాతం కట్టడి చేస్తామన్న పోలీసుల ప్రతిజ్ఞలు.. సాంప్రదాయ పందాలనే నిర్వహిస్తామంటూ ప్రజాప్రతినిధుల మాటల ముసుగున కత్తికట్టిన కోడి పందేలకు వేదికలు సిద్ధమవుతున్నాయి. మినీ స్టేడియాలను తలపించే రీతిలో ప్రతి నియోజకవర్గంలో భారీ పందెం బరులను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఆగకుండా సోషల్ మీడియా వేదికగా పందెంరాయుళ్లను ఆకర్షించేలా హడావుడి చేయడం విశేషం. ఇంత జరుగుతున్నా పోలీసులు మొక్కుబడిగానైనా స్పందించని పరిస్థితి. గతేడాది సంక్రాంతి సీజన్‌లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు పందేలు జరిగినట్టు అంచనా. ఈసారి అంతకు మించి అనే స్థాయిలో పందేల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ, కర్నాటకలకు చెందిన బడా నాయకులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పలుకుతున్నారు.
మండలానికి 15కు తగ్గకుండా..
ప్రతి నియోజకవర్గంలోనూ భారీ పందెం బరులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి మండలానికీ 15కు తగ్గకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలోని దుగ్గిరాలలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు సంబంధించిన బరి మినీ స్టేడియం తరహాలో సిద్ధమైంది. పందెంరాయుళ్లు కూర్చోవడానికి వీలుగా సాధారణ గ్యాలరీలు మొదలు వీఐపీల గ్యాలరీ వరకు పందెం బరుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి సంబంధించిన అప్‌డేట్లను సోషల్ మీడియాలో సైతం పోస్టులు చేస్తున్నారు. ఇదే తరహాలో తాడేపల్లిగూడెంలోని ఏరియా ఆస్పత్రి వెనుక భారీ బరి సిద్ధం చేస్తున్నారు. తణుకు నియోజకవర్గంలోని అత్తిలి, తేతలి, ఆచంట నియోజకవర్గంలోని మార్టేరు, వెలగలేరు, పాలకొల్లు నియోజకవర్గంలో చించినాడ బ్రిడ్జి వద్ద, భీమవరంలోని వీరవాసరం, సీసలి, జువ్వలపాలెం, ఉండి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో, జంగారెడ్డిగూడెం, చింతలపూడి ప్రాంతాల్లోనూ బరులు సిద్ధమవుతున్నాయి.
ప్రజాప్రతినిధులకు పర్సంటేజీలు
కూటమి పార్టీల నేతలే పూర్తిస్థాయిలో పందేల నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పందేల స్థాయిని బట్టి ప్రజాప్రతినిధులతో పర్సంటేజీలు ఖరారు చేసుకుంటున్నారు. జిల్లాలో ఇద్దరు, ముగ్గురు ప్రజాప్రతినిధులు ఇంకో అడుగు ముందుకేసి సొంత బరులు, సొంత స్థలాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.లక్షల నుంచి రూ.కోట్ల స్థాయి మొ దలు, పందేల జరిగే బరుల వరకూ ముడుపులను పర్సంటేజీల వారీగా ఖరారు చేస్తున్నారు. వీటిల్లో సింహభాగం ప్రజాప్రతినిధి ముఠాకే దక్కుతుంది. అవన్నీ కూడా ఖర్చుల పేరిట వసూలు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఇక పేకాట, గుండాట నిర్వాహకులకు కూడా పందేల స్థాయిని బట్టి రేట్లు ఖరారు చేస్తున్నారు.
పండగ పేరు.. జూదాల జోరు
ఉమ్మడి పశ్చిమలో బరులకు ఏర్పాట్లు
భారీస్థాయిలో పందేలకు సన్నాహాలు
మినీ స్టేడియాలను తలపించేలా వేదికలు
ప్రజాప్రతినిధులతో నిర్వాహకుల వాటాల మంతనాలు
పేకాట, గుండాట, కోతాటలకు స్పెషల్ ప్యాకేజీ
సోషల్ మీడియా వేదికగా బరుల వివరాలు వెల్లడి
అడ్డగోలుగా బరులు ఏర్పాటుచేస్తున్నా పట్టించుకోని పోలీసు యంత్రాంగం
ఉమ్మడి జిల్లాలో ఏటా సంక్రాంతి సీజన్‌లో భారీగా కోడి పందేలు నిర్వహిస్తుంటారు. రూ.5 వేల నుంచి మొదలు రూ.5 కోట్ల వరకు పందేలు కాస్తూ మూడు రోజులపాటు నిర్వహిస్తుంటారు. వీటితో పాటు పేకాట, గుండాట, కోతాట, ఇతర జూదక్రీడలు విచ్చలవిడిగా జరుగుతుంటాయి. పోలీసులు యథావిధిగా కోడిపందాల సీజన్ ముందు మొక్కుబడి బైండోవర్లు, నియోజకవర్గానికి ఓ చోట పందెం బరులను ధ్వంసం చేయడం, కోడికి కట్టే కత్తులను పదుల సంఖ్యలో సీజ్ చేసి నివేదికను హైకోర్టుకు పంపి కట్టడి చేస్తున్నట్టు ప్రకటించి పండగ దాటించేస్తుంటారు. అయితే ఈ ఏడాది జిల్లాలో పోలీస్ స్పందన మాత్రం నామమాత్రంగానే ఉంది. ఉమ్మడి పశ్చిమ రాష్ట్రంలోనే కాకుండా దక్షిణ భారతంలోనే కోడి పందేలకు ప్రసిద్ధి. ఆంధ్ర, తెలంగాణతో పాటు బెంగళూరు, చైన్నె నుంచి పెద్ద సంఖ్యలో పందెంరాయుళ్ల వస్తుంటారు. ముఖ్యంగా భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, కై కలూరులో మూడు రో జుల పాటు మకాం వేసి రూ.లక్షలు మొదలు రూ.కోట్ల వరకు పందేలు కడుతుంటారు.


