వ్యూహాలకు పదును పెట్టాలి
తాడేపల్లిగూడెం: లక్ష్యాలు సాధించాలంటే విద్యార్థులు వ్యూహాలకు పదును పెట్టాలని నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్ ఎన్‌వీ రమణరావు పిలుపునిచ్చారు. ఇనిస్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్, ఏపీ నిట్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ కమ్ స్కిల్ డెవలప్‌మెంటు ప్రోగ్రామ్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఏపీఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సహకారంతో ఈనెల 20 నుంచి 20 రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వి ద్యార్థులు సృజన శీల వ్యాపార ఆలోచనలకు ఆకృతినిస్తే అంకుర పరిశ్రమలు రూపుదిద్దుకుంటాయన్నారు. ఆధునిక పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలన్నారు. విభిన్న ఆలోచనలు, ప్రాజెక్టులతో ముందుకొచ్చే విద్యార్థులను సంస్థ ప్రోత్సహిస్తోందన్నారు. నిట్ డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ, కార్యక్రమం చైర్మన్ జి.రవికిరణ్‌శాస్త్రి మాట్లాడుతూ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యవంతులుగా తయారు కావడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి, నిట్ అధికారులు పాల్గొన్నారు.


