మధ్యవర్తిత్వంపై ప్రత్యేక సదస్సు
ఏలూరు (టూటౌన్): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం ఈ నెల 2 నుంచి 31 వరకు మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కారం నిమిత్తం స్పెషల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా శాశ్వత లోక్ అదాలత్ చైర్‌పర్సన్ ఎ.మేరీ గ్రేస్ కుమారి తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో శిక్షణ పొందిన మధ్యవర్తులకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. మధ్యవర్తులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, కక్షిదారులకు న్యాయ సహాయం అందించడానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్, రిటైర్డ్ అదనపు జిల్లా జడ్జి ఏ.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


