వేటకు పోటు | - | Sakshi
Sakshi News home page

వేటకు పోటు

Jan 4 2026 11:16 AM | Updated on Jan 4 2026 11:16 AM

వేటకు

వేటకు పోటు

డీజిల్‌ సబ్సిడీ నిలుపుదల దారుణం సాంకేతిక కారణాలతో ఆగాయి

మత్స్యకార సంఘాల ఆగ్రహం

సముద్రంలో వేట సాగించే బోట్లకు డీజిల్‌ సబ్సిడీ సొమ్ములు ప్రభుత్వం మూ డు నెలలుగా జమ చేయడం లేదు. ఇది చాలా దారుణం. మత్స్యకార భృతి పెంచామని చెబుతున్న ప్రభుత్వం డీజిల్‌ సబ్సిడీ లేకుండా చేసి నడ్డివిరిచింది. వెంటనే ప్రభుత్వం పెండింగ్‌ సొమ్ములు జమచేయాలి. నెలకు రిజిస్టర్‌ బోటుకు డీజిల్‌ సబ్సిడీ కింద రూ.10 వేలు అందించాలి.

– బర్రి శంకరం, మత్యకార నేత

డీజిల్‌ సబ్సిడీ సొమ్ములు కొంతకాలంగా జమకాకపోవడం నిజమే. అయితే సాంకేతిక ఇబ్బందులు కారణంగానే ఇది జరిగింది. త్వరలో డీజిల్‌ సబ్సిడీ బోటు యజమానుల బ్యాంకు ఖాతాల్లో జమవు తుంది. నరసాపురంలో 139 రిజిస్టర్‌ బోట్లు ఉన్నాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ వేట సాగించే బోట్లకు ఆ బోట్లు ఏ జిల్లాలో రిజిస్టర్‌ అయ్యి ఉంటే అక్కడే సొమ్ములు జమవుతాయి.

– వై.ఏడుకొండలు,

ఇన్‌చార్జ్‌ మత్స్యశాఖ అధికారి, నరసాపురం

నరసాపురం: సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు చంద్రబాబు ప్రభుత్వం డీజిల్‌ సబ్సిడీని మూడు నెలలుగా నిలిపివేసింది. ఇక ఈ సబ్సిడీని పూర్తిగా నిలిపివేయడానికి నిర్ణయించినట్టు సమాచారం. దీంతో గంగపుత్రులపై డీజిల్‌ భారం పడుతోంది. అలాగే సముద్రపు వేట కష్టం కానుంది. ఇప్పటికే ప్రకృతి విపత్తులతో వేట సవ్యంగా సాగడం లేదు. దీనికి తోడు డీజిల్‌ సబ్సిడీకి బ్రేక్‌ వేయడంతో వేటకారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మరోవైపు ఐస్‌ ధరలు, నిర్వహణ వస్తువు ల ధరలు కూడా పెరగడంతో వేటకు ఖర్చు తడిసిమోపెడు అవుతోందని అంటున్నారు.

బోటుకు 300 లీటర్లు

ప్రభుత్వం వేట బోటుకు నెలకు 300 లీటర్ల డీజిల్‌పై సబ్సిడీ కింద రూ.2,700 ఇస్తుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సంబందించి నరసాపురంలో రిజిస్టర్‌ వేట బోట్లు 139 ఉన్నాయి. గతంలో డీజిల్‌ సబ్సిడీ లీటరు రూ.6 ఉండగా.. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.9కు పెంచింది. ఇలా సముద్రపు వేటకు ఊతమిచ్చింది. జిల్లాలో సుమారు 5 వేల కుటుంబాలు వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 19 కిలోమీటర్లు మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. నరసాపురం తీరంలో రోజూ 80కి పైగా మెకనైజ్డ్‌ బోట్లు వేట సాగిస్తాయి. మత్స్య సంపద ఎక్కువగా లభిస్తుండటంతో విశాఖ, మచిలీపట్నం, కాకినాడ, నెల్లూరు ప్రాంతాలకు చెందిన బోట్లు కూడా ఇక్కడ వేట సాగిస్తాయి.

డీజిల్‌ దెబ్బకు విలవిల

ప్రస్తుతం డీజిల్‌ ధర లీటరు రూ.98లుగా ఉంది. వేట బోట్లకు డీజిల్‌ ప్రధానం. ఒక్కో బోటు సముద్రంలోకి వేటకు వెళ్లి రోజుల తరబడి ఉంటుంది. సరుకు సరిగా పడకపోతే 10 నుంచి 20 రోజుల వరకు వేచి ఉంటారు. దీంతో అన్ని రోజులకు సరిపడా డీజిల్‌ నింపుకుని వెళుతుంటారు. బోటు కండీషన్‌ను బట్టి రోజుకు ఒక్కో బోటుకు 20 నుంచి 30 లీటర్ల డీజిల్‌ అవసరం. వేటకు వెళ్లాలంటే దాదాపు 300 నుంచి 400 లీటర్లు డీజిల్‌ నింపుకోవాలి. సగటున 400 లీటర్ల డీజిల్‌కు రూ.40 వేల వరకు ఖర్చవుతుంది. మొత్తంగా వలలు, ఐస్‌, నిర్వహణ ఖర్చులు కలిపి ఒక బోటుకు సుమారు రూ.లక్షకు పైగా ఖర్చవుతోంది. ఈ పరిస్థితుల్లో డీజిల్‌ సబ్సిడీ అందకపోవడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు.

మత్స్య కార్మికులపైనా భారం

ఒక్కోబోటుపై 10 మంది వరకు మత్స్యకారులు పని చేస్తారు. వీరికి ప్రత్యేకంగా జీతాలు ఉండవు. వేట ఖర్చులు పోను పడిన సరుకులో వచ్చిన లాభాన్ని బోటు యజమాని కార్మికులకు కొంత శాతం వాటాగా పంచుతాడు. ప్రస్తుతం డీజిల్‌ సబ్సిడీ అందకపోవడంతో మత్స్య కార్మికులపైనా ఈ ప్రభావం పడుతోంది. అలాగే గోదావరిలో వేట సాగించే ఇంజిన్‌ చెక్క నావలు కూడా నరసాపురం తీరంలో 200 వరకూ ఉంటాయి. వీరికీ డీజిల్‌ పోటు తప్పడం లేదు. లీటర్ల లెక్కతో సంబంధం లేకుండా డీజిల్‌ సబ్సిడీ నెలకు రూ.10 వేలు ఇవ్వాలని మత్స్యకార సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. అయి నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

మూకుమ్మడిగా వేట

సాగిస్తున్న మత్స్యకారులు

ఆటు‘బోట్లు’

మూడునెలలుగా డీజిల్‌ సబ్సిడీకి బ్రేక్‌

చేపల వేటకు ఖర్చులు తడిసిమోపెడు

నష్టాలు చవిచూస్తున్న మత్స్యకారులు

డీజిల్‌ పథకానికి కత్తెరపై నిట్టూర్పు

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డీజిల్‌ సబ్సిడీని పెంచాల్సిన చంద్రబాబు ప్రభుత్వం రాయితీని ఇవ్వకపోవడంపై మత్స్యకార సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ఏడాదిన్నరగా చంద్రబాబు ప్రభు త్వం పలు నిబంధనలతో మత్స్యకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మత్స్యశాఖ వద్ద రిజిస్టర్‌ అయిన బోట్లు యజమానులు ముందుగా డీజిల్‌కు డబ్బులు పెట్టుకోవాలి. తరువాత బిల్లును మత్స్యశాఖకు సమర్పిస్తే ఆరు నెలలకోసారి బిల్లులు మంజూరవుతాయి.

వేటకు పోటు 1
1/2

వేటకు పోటు

వేటకు పోటు 2
2/2

వేటకు పోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement