ఎరువు.. ధర బరువు
ఎరువుల ధరలు (బస్తాకు..)
సాక్షి, భీమవరం: మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఉంది రైతుల పరిస్థితి. ఖరీఫ్ చివరిలో మోంథా, దిత్వా తుపాన్ల ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు రబీ ఆరంభంలోనే ఎరువుల ధరల రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. కాంప్లెక్స్ ఎరువులు బస్తాకు రూ.100 నుంచి రూ.220లు వరకు పెరిగాయి. జిల్లాలో 2.22 లక్షల ఎకరాల్లో రబీ సాగు జరుగనుండగా ఎరువుల రూపంలో రైతులపై దాదాపు రూ.15.40 కోట్ల మేర భారం పడుతుంది.
రబీలో వినియోగం ఎక్కువ
ఖరీఫ్‌తో పోలిస్తే రబీలో ఎరువుల వినియోగం ఎక్కువ. ఎకరాకు నాలుగు బస్తాల వరకు రెండు మూడు రకాల కాంప్లెక్స్ ఎరువులు, రెండు బస్తాల యూరియా, అర బస్తా వరకు పొటాష్ వినియోగిస్తుంటారు. జిల్లాలోని 2.22 లక్షల ఎకరాల్లో రబీ సాగు జరుగనుంది. 70 శాతం మేర ఎంటీయూ 1121, మిగిలిన విస్తీర్ణంలో పీఆర్ 126, ఎంటీయూ 1153, ఎంటీయూ 1156 రకాలను సాగు జరుగనుంది. వ్యవసాయ లెక్కలు ప్రకారం ఈ సీజన్‌లో 41,921 టన్నుల యూరియా, 64,992 టన్నుల ఇతర ఎరువులు అవసరం కానున్నాయి.
నత్తనడకన సాగు : మోంథా, దిత్వా తుపాన్లు వలన రైతులకు ఖరీఫ్ కలిసి రాలేదు. మోంథా ప్రభావంతో ఆకివీడు, నరసాపురం, భీమవరం, పెంటపాడు, మొగల్తూరు తదితర మండలాల్లోని 25వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. మాసూళ్లు సమయంలో దిత్వా తుపాను మరింత నష్టం కలిగించింది. తొలకరిలో ఎకరాకు సగటున 26.25 క్వింటాళ్లు చొప్పున జిల్లాలో సాగు చేసిన 2.08 లక్షల ఎకరాలకు 5.77 లక్షల టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా తుపాన్ల వలన సగటు 21 క్వింటాళ్లతో 4.62 లక్షల టన్నులు మాత్రమే వచ్చింది. ఈ మేరకు క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,369 మేరకు తగ్గిన దిగుబడి 1.15 లక్షల టన్నులకు గాను రూ.242.43 కోట్ల మేర రైతులు నష్టపోయారు. పంట పెట్టుబడులు దక్కకపోవడంతో దాళ్వా పైనే ఆశలు పెట్టుకున్నారు. ముందుగా తొలకరి మాసూళ్లు పూర్తయిన తాడేపల్లిగూడెంలో నాట్లు మొదలవ్వగా పెంటపా డు, అత్తిలి, పాలకోడేరు, ఇరగవరం, పెనుమంట్ర, వీరవాసరం, పోడూరు, పెనుగొండ తదితర మండలాల్లో నారుమడులు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో నారుమడులు పోయడం దాదాపు పూర్తికావాల్సి ఉండగా బ్యాంక్ కెనాల్, నరసాపురం, అత్తిలి, జీఅండ్‌వీ, ఉండి, కాకరపర్రు తదితర కాలువల పరిధిలోని శివార్లకు పూర్తిస్థాయిలో నీరందక పనులకు ఆలస్యమైంది. ప్రారంభంలోనే సాగునీటి స మస్య ఎదురవ్వడంతో మున్ముందు వంతుల వారీ విధానం మొదలై ఎండలు ముదిరేకొద్దీ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఉంది. ఖరీఫ్ మి గిల్చిన నష్టంతో రబీ పెట్టుబడులకు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఎరువుల ధరలు పెరగడం వా రిని మరింత ఆవేదనకు గురిచేస్తోంది.
రకం పాత ధర కొత్త ధర
10:26:26 రూ.1,700 రూ.1,920
14:35:14 రూ.1,800 రూ.1,950
20:20:013 రూ.1,300 రూ.1,400
రైతు నెత్తిన పిడుగు
కాంప్లెక్స్ ఎరువుల ధరలకు రెక్కలు
బస్తాకు రూ.100 నుంచి రూ.220 వరకు పెంపు
జిల్లాలో 2.22 లక్షల ఎకరాల్లో దాళ్వా సాగు
రైతులపై రూ.15.40 కోట్ల అదనపు భారం
ఇప్పటికే ఖరీఫ్ కలిసిరాక, దాళ్వా పెట్టుబడులకు సొమ్ములు లేక అవస్థలు
రూ.15.40 కోట్ల భారం
కాంప్లెక్స్ ఎరువుల ధరలను ఇటీవల కంపెనీలు పెంచేశాయి. ఈ సీజన్‌లో ఎక్కువగా వినియోగించే 10:26:26 కాంప్లెక్స్ ఎరువు (50 కేజీలు) రూ.220లు పెరగ్గా, 14:35:14, 20:20:013, ఇతర రకాలు రూ.100 నుంచి రూ.150ల వరకు పెరిగాయి. ఈ మేరకు ఎకరాకు రూ.700ల వరకు రైతులపై అదనపు భారం పడనుందని అంచనా. జిల్లాలోని 2.22 లక్షల ఎకరాలకు గాను రైతులపై రూ.15.40 కోట్ల మేర అదనంగా భారం పడుతోంది.


