కాంట్రాక్టర్‌పై పోలీస్ కేసు నమోదు
భీమవరం (ప్రకాశంచౌక్): ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత గడువులోపు పూర్తిచేయనందున అజాయ వెంచర్స్ ఎల్‌ఎల్‌పీ కాంట్రాక్టర్‌పై పోలీస్ కేసు నమోదు చేశామని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలపై కాంట్రాక్టర్లతో, పీఎంఏవై 1.0 ఇళ్ల నిర్మాణాలపై హౌసింగ్ అధికారులతో సమీక్షించారు. పీఎంఏవై 1.0 ఆప్షన్–3కి సంబంధించి అజాయ వెంచర్స్ కాంట్రాక్టర్ 2025 డిసెంబర్ నాటికి 1,780 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉండగా కేవలం 7 ఇళ్లను మాత్రమే పూర్తి చేశారన్నారు. పూర్తిగా అలసత్వం వహించిన వీరిపై ఇళ్ల నిర్మాణాలకు మ్యాప్ చేసిన డివిజన్ల పరిధిలో పోలీస్ కేసులు నమోదు చేశామన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో బాధ్యతారాహిత్యంగా ఉంటే క్షమించ బోమని హెచ్చరించారు. జిల్లాలో కాంట్రాక్టర్లు ఆప్షన్–3 కింద 6,271 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉండగా 1,191 ఇళ్లను పూర్తిచేశారని, నిర్మాణాలు వేగిరపర్చాలన్నారు. పీఎంఏవై 1.0లో వివిధ కేటగిరీల కింద జిల్లాలో 56,210 గృహ నిర్మాణాలు మంజూరు కాగా ఇప్పటివరకు 36,052 నిర్మాణాలను పూర్తిచేశామన్నారు. ఉగాది నాటికి 11,846 ఇళ్ల నిర్మాణాలు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. నూరు శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య, డీఈలు, ఏఈలు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.


