యూరియా కోసం తప్పని పాట్లు
పెనుగొండ: యూరియా కోసం రైతుల పాట్లు తప్పడం లేదు. కొత్త ఏడాది తొలిరోజు గురువారం ఉదయం నుంచి ఆచంట సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం పడిగాపులు పడ్డారు. యూరియా పంపిణీపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో రైతులు ఒకేసారి ఎక్కువ మంది వస్తుండటంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. దీంతో గందరగోళం నెలకొంది. యూరియా సమృద్ధిగా సమకూరుస్తున్నామని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి స్వయంగా ప్రకటించినా రైతుల్లో మాత్రం ఆందోళన నెలకొనే ఉంది. దీనికి కారణం ఆయా సొసైటీల వద్ద టీడీపీ నాయకులు తమవారికి ముందుగా యూరియాను అందించాలంటూ హుకుం జారీ చేయడమే కారణమని రైతులు అంటున్నారు. మొదటి విడత కోటా ప్రకారమే పంపిణీ అంటూ అధికారులు ప్రకటిస్తున్నా, కొందరు మాత్రం కోటాకు మించి తీసుకువెళ్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆచంట మండలంలో యూరియా కొరత లేకుండా అన్ని చర్యలూ తీసుకున్నామని వ్యవసాయాధికారి బి.నాగరాజు తెలిపారు. గురువారం సైతం మండలానికి యూరియా వచ్చిందన్నారు.


