అభయారణ్యం.. స్వేచ్ఛా విహారం
సంరక్షణకు ప్రత్యేక చర్యలు
బుట్టాయగూడెం: పాపికొండల అభయారణ్యంలో పెద్ద పులులు, చిరుతలు గాండ్రిపులతో, పక్షుల కిలకిలరావాలతో సందడి చేస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో అభయారణ్యం పరిధిలోకి వచ్చే 23 గ్రామాలు ఖాళీ చేసి ఆయా గ్రామాల్లో ఉండే నిర్వాసితులను ప్రభుత్వం పునరావాస కాలనీలకు తరలించడంతో వన్యప్రాణుల స్వేచ్ఛా జీవనానికి అవకాశం కలిగింది. గోదావరి ఒడ్డున ఉండే గ్రామాలు ఖాళీ కాగా జనసంచారం లేకపోవడంతో పాపికొండల్లో వన్యప్రాణులు మరింత స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం ఏర్పడింది. ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం 2008లో పాపికొండల అభయారణ్యంగా ప్రకటించింది. దీంతో అప్పటివరకు రాష్ట్ర పరిధిలో ఉన్న పాపికొండ లు కేంద్రం పరిధిలోకి మారింది. ఫారెస్టు, వైల్డ్‌లైఫ్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వన్యప్రాణులు సంరక్షణకు కృషి చేస్తున్నారు.
1012 చ.కిలోమీటర్ల పరిధిలో..
పాపికొండల అభయారణ్యం ఏలూరు జిల్లా పరిధిలోని బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలతో పాటు రంపచోడవరం నియో జకవర్గంలోని దేవీపట్నం, వీఆర్‌పురం, చింతూరు, మండలాల పరిధిలో సుమారు 1,012.85 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది.
నాలుగేళ్లకోసారి గణన
పాపికొండల అభయారణ్యంలో ప్రతి నాలుగేళ్లకోసారి అధికారులు జంతుగణన నిర్వహించి అడవుల్లో ఉండే వన్యప్రాణులను గుర్తించే ప్రక్రియ చేపడతారు. 2018, 2022ల్లో జంతుగణన నిర్వహించారు. ఆ సమయంలో 116 ప్రాంతాల్లో 232 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి సర్వే చేశారు. సింహాలు, ఏనుగులు తప్ప అన్నిరకాల జంతువులు ట్రాప్ కెమెరాలకు చిక్కాయి.
నేటి నుంచి పులుల జాడ కోసం..
పాపికొండల అభయారణ్యంలో పులుల జాడ కోసం అటవీ శాఖ అధికారులు శుక్రవారం ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. సుమారు 130 ప్రాంతాల్లో 300కు పైగా కెమెరాలు ఏర్పాటు చేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. గతనెల 1న జాతీయ పులుల గణన, వన్యప్రాణుల లెక్కింపు కార్యక్రమం సుమారు 8 రోజులపాటు నిర్వహించారు. ఇందుకోసం అటవీశాఖ అధికారులు ట్రయిల్‌రన్‌ను కూడా నిర్వహించారు. అయి తే పులుల జాడ కోసం డబ్ల్యూడబ్ల్యూఎఫ్ రిప్రజెంటేటివ్‌ల ఆధ్వర్యంలో పులుల జాడపై ట్రాప్ కెమెరాల ద్వారా సర్వే చేయనున్నారు.
గోదావరి తీరం.. స్వేచ్ఛా విహారం
గోదావరి పరీవాహక ప్రాంతంలో నది ఒడ్డున ఉన్న తెల్లదిబ్బలు, సిరివాక, కొరుటూరు, శివగిరి, చీడూరు, టేకూరు, తూటిగుంట, ఎర్రవరం, సరుగుడు, పల్లపూరు, పైడాకులమామిడి, వాడపల్లి, కోండ్రుకోట, మాదాపురం, ములగలగూడెం, గాజులగొంది, తల్లవరం, కొత్తూరు, కొత్తమామిడిగొంది, చేగొండపల్లి తదితర గ్రామాలను పోలవరం ప్రాజెక్టులో ముంపు గ్రామాలుగా ప్రభుత్వం గుర్తించింది. ఆయా గ్రామాల నిర్వాసితులను బుట్టాయగూడెం, జీలు గుమిల్లి మండలాలకు తరలించారు. దీంతో ప్రస్తు తం ఆయా గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. జనసంచారం కూడా లేకపోవడంతో ఆయా గ్రామాల్లో వ న్యప్రాణులు స్వేచ్ఛగా తిరుగుతూ నీటి కోసం గో దావరి తీరానికి వస్తున్నాయి. పాపికొండల విహార యాత్రకు వెళ్లే పర్యాటకులు నెమళ్లు, అడవి దున్నలు, దుప్పిలు కనిపించినట్టు చెబుతున్నారు.
వన్యప్రాణుల ఆవాసం
లక్ష ఎకరాల్లో పాపికొండల అభయారణ్యం
పులులు, చిరుతలు, అడవి దున్నల సంచారం
పోలవరం ముంపు గ్రామాల తరలింపుతో మరింత స్వేచ్ఛగా జీవనం
235 రకాలకుపైగా పక్షి జాతుల గుర్తింపు
పాపికొండల అభయారణ్యంతోపాటు ఆ ప్రాంతంలోని 23 గ్రామాలు ఖాళీ కావడంతో వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. వాటి సంరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు గస్తీ కూడా నిర్వహిస్తున్నాం. వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యంగా కృషి చేస్తున్నాం.
– ఎస్‌కే వల్లీ, అటవీశాఖ అధికారి, పోలవరం రేంజ్
అభయారణ్యం.. స్వేచ్ఛా విహారం
అభయారణ్యం.. స్వేచ్ఛా విహారం


