భక్తుల కొంగు బంగారం.. మావుళ్లమ్మ
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం పట్టణ ఇలవేల్పు, భక్తులపాలిట కొంగు బంగారం, కోరిన కోర్కెలు తీర్చే తల్లి మావుళ్లమ్మవారి 62వ వార్షిక మహోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. నీరుల్లి కూరగాయ, పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో దేవస్థానం సహకారంతో ఈనెల 13 నుంచి వచ్చేనెల 14 వరకు జాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే అమ్మవారి అలంకరణ పనులు పూర్తయ్యాయి. ఆలయం వద్ద చలువ పందిళ్లు, భారీ సెట్టింగ్‌లు, క్యూలైన్, లైటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయానికి నలుదిక్కులా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సెట్టింగ్‌లు, విద్యుత్ దీపా ల అలంకరణలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
భారీగా భక్తులు : ఉత్సవాలను తిలకించేందుకు జిల్లాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజుల్లో ఆలయం కిటకిటలాడుతుంది. సంక్రాంతికి జిల్లాకు వచ్చే ఇతర ప్రాంతాల వాసులు అమ్మవారిని దర్శించుకోవడం సెంటిమెంట్‌గా భావిస్తారు. ఇలా నెల రోజుల పాటు ఆలయం వద్ద భక్తజన సందడి ఉంటుంది. ముఖ్యంగా ఆలయం వద్ద విద్యుత్ అలంకరణ, సెట్టింగులు చూసేందుకు పలువురు వస్తుంటారు.
మహా అన్నసమారాధన
ఉత్సవాల రోజుల్లో ఆలయం వద్ద ఉత్సవ నిర్వాకులు అన్నదానం నిర్వహిస్తారు. రోజుకు సుమారు 7 వేల మంది వరకు భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. అలాగే ఉత్సవాల చివరి రోజు మహా అన్నదానం నిర్వహిస్తారు. ఆ రోజున సుమారు లక్ష మంది అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు.
61 ఏళ్లుగా ఉత్సవాలు
61 ఏళ్లుగా నీరుల్లి కూరగాయ, పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో నెలరోజుల పాటు నిర్వహించే ఏకైక ఉత్సవంగా మావుళ్లమ్మ జాతర నిలుస్తుంది. గతంలో ఉత్సవాల్లో సినిమా నటులను సన్మానించి బంగారాన్ని బహూకరించేవారు.
నిలువెత్తు స్వర్ణమయం : అమ్మవారిని నిలువెత్తు స్వర్ణమయం చేయడానికి దాతలు, భక్తుల నుంచి బంగారాన్ని సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 73 కిలోల బంగారం సేకరించగా 60 కిలోల వరకూ ఆభరణాలు తయారు చేసి అమ్మవారికి అలంకరించారు. మరో 13 కిలోల బంగారం ఆభరణాల తయారీకి సిద్ధం చేశారు. అయితే ఉన్నతాధికారుల అనుమతులతో ఆలస్యమవుతోంది. మొత్తంగా 100 కిలోలు బంగారు ఆభరణాలను అమ్మవారికి అలంకరించాలనే లక్ష్యంగా ఆలయ అధికారులు, ఉత్సవ నిర్వాహికులు దాతలను ప్రోత్సహిస్తున్నారు.
ఆలయం వద్ద సెట్టింగ్‌కు ఏర్పాట్లు
సిరుల తల్లి.. కల్పవల్లి
13 నుంచి అమ్మవారి ఉత్సవాలు
నెల రోజులపాటు వేడుకలు
ఆలయం వద్ద చురుగ్గా ఏర్పాట్లు
రూ.90 లక్షలతో జాతర నిర్వహణ
రూ.90 లక్షల వ్యయంతో..
ఏటా రూ.80 లక్షల నుంచి రూ.90 లక్షలతో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మరింత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ సెట్టింగ్స్, లైటింగ్స్ ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జానపద, భరత నాట్య ప్రదర్శనలు, హరికథ, బుర్రకథ వంటి కళాప్రదర్శనలు, సినీ సంగీత విభావరులు ఏర్పాటుచేస్తారు. సుమారు 30 నాటకాలు, 20 హరికథ, బుర్రకథలు, 15 వరకూ సినీ సంగీత విభావరీ కార్యక్రమాలు ఉంటాయి. ఇలా ఆదరణ కోల్పోతున్న నాటకాలను ప్రోత్సహించి నాటక కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నారు.
భక్తుల కొంగు బంగారం.. మావుళ్లమ్మ
భక్తుల కొంగు బంగారం.. మావుళ్లమ్మ


