అంజన్నకు విశేష పూజలు
జంగారెడ్డిగూడెం: నూతన సంవత్సరం సందర్భముగా గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. జంగారెడ్డిగూడెం పట్టణం, మండలంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానానికి వివిధ సేవల రూపేణా రూ.3,97,450 ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనరు, కార్యనిర్వహణాధికారిణి ఆర్‌వీ చందన తెలిపారు. స్వామివారిని బిగ్‌బాస్ సీజన్ 9 సెకండ్ రన్నరప్ డెమోన్ పవన్ దర్శించుకున్నారు.
నూజివీడు: జాతీయస్థాయి సీనియర్ బాస్కెట్‌బాల్ పోటీలకు నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంపికయ్యారు. పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న బేతాళ ప్రభుదీపిక, షేక్ ఆస్రా చైన్నెలో ఈనెల నాలుగో తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొననున్నారు. వీరిని నూజివీడు డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్, పరిపాలనాధికారి లక్ష్మణరావు, డీన్ అకడమిక్స్ సాదు చిరంజీవి, పీడీ సుబ్బలక్ష్మి అభినందించారు.
ద్వారకాతిరుమల: క్షేత్రంలో జరుగుతున్న ధనుర్మాసోత్సవాలు శ్రీవారి వైభవాన్ని చాటుతున్నాయి. నిత్యం ఆలయంలో సుప్రభాత సేవకు బదులు, తిరుప్పావై పాశురాలను పఠిస్తున్నారు. అలాగే స్వామివారి గ్రామోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. అందులో భాగంగా గురువారం ఉదయం జరిగిన శ్రీవారి తిరువీధి సేవ ఆదం్యతం భక్తులకు నేత్రపర్వమైంది. ఉదయం ఆలయంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, విశేష పుష్పాలంకారాలు చేశారు. పూజాధికాల అనంతరం స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అశ్వ, గజ సేవలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ శ్రీవారు క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు. అనంతరం స్థానిక ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవికి అర్చకులు విశేష పూజలు జరిపి, హారతులిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించి, తీర్థప్రసాదాలను స్వీకరించారు.
అంజన్నకు విశేష పూజలు
అంజన్నకు విశేష పూజలు


