దైవ దర్శనానికి వెళ్లి వస్తూ మృత్యుఒడికి
● ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ
● భార్య మృతి, భర్తకు తీవ్రగాయాలు
తణుకు అర్బన్: నూతన సంవత్సరం తొలి రోజున దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న దంపతులపై మృత్యువు లారీ రూపంలో కబళించింది. తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతిచెందగా భర్తను ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. తణుకు మండలం వేల్పూరు చింతలదొడ్డిలో నివసిస్తున్న అందే లోకేశ్వరరావు, వెంకటలక్ష్మి దంపతులు తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరి ద్వారకాతిరుమల, మద్ది ఆంజనేయస్వామి ఆలయాలకు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. ఆలయాల్లో స్వామివార్ల దర్శనాల అనంతరం తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో సరిగ్గా తేతలి జాతీయ రహదారి ప్రాంతంలోకి వచ్చేసరికి తమిళనాడుకు చెందిన లారీ వేగంగా ఢీకొట్టడంతో వెంకటలక్ష్మి (43) అక్కడికక్కడే మృతి చెందింది. భర్త లోకేశ్వరరావును ముందుగా తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకువచ్చి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యసేవలకు ఏలూరు ఆశ్రం హాస్పిటల్‌కు తరలించారు.
మిన్నంటిన భర్త రోదన
ఘటనా ప్రాంతంలో కళ్ల ముందే భార్య వెంకటలక్ష్మి మరణాన్ని దగ్గరగా చూసిన లోకేశ్వరరావు తట్టుకోలేకపోయారు. బంధువులకు ఫోన్‌లు చేసి నా వెంకటలక్ష్మి ఇక లేదంటూ తల్లడిల్లిపోయారు. భార్య మృదదేహం వద్ద ఆయన రోదనలు మిన్నంటాయి. లోకేశ్వరరావు ఉండ్రాజవరం మండలం పాలంగిలో మెడికల్ దుకాణం నిర్వహిస్తున్నారని, కుమారుడు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా కుమార్తె ఫార్మసీ విద్యనభ్యసిస్తున్నట్లు బంధువులు తెలిపారు. కుమార్తె అందే వల్లి ధన దుర్గ ప్రసన్న ఇచ్చిన ఫిర్యాదుమేరకు తణుకు రూరల్ ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


