చిన వెంకన్నా.. వస్తున్నాం
క్షేత్రానికి చేరుకునేదిలా..
ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రం
క్యూలైన్లలో ప్రతి 30 అడుగులకు ఒక అత్యవసర ఎగ్జిట్ గేటును ఏర్పాటు చేశారు. అడుగడుగునా మంచినీటి సౌకర్యం, అల్పాహారం, స్నాక్స్ అందించేందుకు 400 మంది సేవా సిబ్బందిని వినియోగించనున్నారు. అలాగే ప్రథమ చికిత్సా కేంద్రాన్ని అనివేటి మండపం వద్ద ఏర్పాటు చేస్తారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి గిరి ప్రదక్షిణకు సమయం ఆసన్నమైంది. మల్లేశ్వరం మీదుగా 5 కిలోమీటర్ల కొండ చుట్టూ ప్రదక్షిణ చేసే సమయం వచ్చింది. ముక్కోటి ఏకాదశి పర్వదినం ముందు రోజు సోమవారం గిరి ప్రదక్షిణ వేడుక అట్టహాసంగా జరగనుంది. ఈ ఏడాది వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారని ఆలయ అధికారులు అంచనా వేశారు. ఇదిలా ఉంటే గిరి ప్రదక్షిణ మరుసటి రోజు మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారు ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉత్తర ద్వార దర్శనం ఆరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. గిరి ప్రదక్షిణ, ఉత్తర ద్వార దర్శనానికి క్షేత్రంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే క్యూలైన్ల నిర్మాణం, ఉత్తర ద్వారాల ముస్తాబు, విద్యుత్ అలంకారాల పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం భక్తులు, గోవింద స్వాముల పాదాల రక్షణ కోసం గిరి ప్రదక్షిణ మార్గంలో గడ్డిని పరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దారి పొడవునా విద్యుత్ లైట్లు, సేదతీరేందుకు షామియానా పందిళ్లను నిర్మించనున్నారు. గిరి ప్రదక్షిణలో శ్రీవారు కొలువుదీరనున్న ధర్మప్రచార రథాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఉత్సవాల ఏర్పాట్లను జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎంవీ రమణ శనివారం సాయంత్రం పరిశీలించారు.
శ్రీవారి ధర్మప్రచార రథం
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రైల్వే మార్గం గుండా ద్వారకాతిరుమలకు 17 కిలో మీటర్ల దూరంలో ఉన్న భీమడోలు రైల్వేస్టేషన్‌కు చేరుకొని, అక్కడినుంచి ఆర్టీసీ బస్సులు, ఆటోల ద్వారా క్షేత్రానికి చేరుకోవాలి. అలాగే జిల్లాలోని ఏప్రాంతం నుంచి అయినా బస్బుల ద్వారా క్షేత్రానికి చేరుకోవచ్చు.


