పట్టిసం శివరాత్రి ఏర్పాట్లపై మొదటి సమావేశం
పోలవరం రూరల్: మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉత్సవ కమిటీ చైర్మన్, జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎంవీ రమణ అధికారులను ఆదేశించారు. శనివారం పోలవరం మండలం పట్టిసం రేవులో ఫిబ్రవరి 15న జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి చేసే ఏర్పాట్లపై తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ గతంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో జరిగిన లోటుపాట్లను సరిచేసుకుంటూ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలన్నారు. 2వ సమావేశం నాటికి అధికారులందరూ చేసే ఏర్పాట్లపై ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. జమా ఖర్చుల విషయంలో నిబద్ధతతో వ్యవహరించాలన్నారు. డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు పోలీసు శాఖ నిర్వహించే విధులపై వివరించారు. ప్రధానంగా గతేడాది ఇసుక తిన్నెలు, శివక్షేత్రం వైపు విద్యుత్ అలంకరణ విషయంలో కొంత లోటు కనబడిందని అది సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.
లడ్డూ ప్రసాదం వేలం నిర్వహించడం లేదు
ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి మాట్లాడుతూ గతేడాది ఉత్సవాలకు ముందు రూ.10 టిక్కెట్ ధర పెంచారని, ఈ మేరకు వచ్చిన ఆదాయాన్ని ఎందుకు ఖర్చు చేశారనే విషయాన్ని తెలియజేయలేదన్నారు. అలాగే దేవస్థానం వద్ద లడ్డూ ప్రసాదం వేలం నిర్వహించడం లేదని, గతంలో వేలం నిర్వహించడం వల్ల లడ్డూలో నాణ్యతను పాటించేవారని పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు సంతృప్తికరంగా అందించాలన్నారు.
ఉత్సవాలకు ఆదాయం సమకూరడం లేదు
సర్పంచ్ సబ్బారపు శ్రీరామమూర్తి మాట్లాడుతూ పట్టిసం ఫెర్రీ వేలం పాట ఆదాయం రూ.13 లక్షలు చేకూరుతుందని, ఖర్చులు రూ.25 లక్షల వరకు అవుతున్నాయని, ప్రతి ఏటా ఉత్సవాలకు ఖర్చు చేసిన ఆదాయం సమకూరడం లేదని, పంచాయతీలో ఏర్పాట్లు చేసిన వారికి బకాయిలు ఉన్నాయన్నారు. దేవస్థానం అధికారులు కొంత సొమ్ము ఇస్తామని ప్రకటించినా గత రెండేళ్లుగా ఒక్క రూపాయి కూడా పంచాయతీకి చెల్లించలేదన్నారు. అన్ని విషయాలను చర్చించామని, ఏర్పాట్ల విషయంలో ఏ విధమైన రాజీ పడవద్దని ఉత్సవ కమిటీ చైర్మన్ ఆదేశించారు. కార్యక్రమంలో పోలవరం సీఐ బాల సురేష్‌బాబు, ఎస్సై ఎస్‌ఎస్ పవన్‌కుమార్, దేవస్థానం ఈవో సీహెచ్ వెంకటలక్ష్మి, డీఎల్‌పీవో సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


