ప్రభుత్వ స్థలాలపై అక్రమార్కుల కన్ను
పోలీసులకు ఫిర్యాదు చేశాం
సాక్షి నెట్‌వర్క్: పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం సేకరించిన భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. ఇంకేముంది రాత్రి పూట అక్రమంగా చేపల చెరువుల కోసం తవ్వకాలు మొదలు పెట్టేశారు. విషయం తెలుసుకున్న అధికారులు వెళ్లి అడ్డుకుని వాటిని నిలుపుదల చేశారు. అయినా తవ్వకాలు జరుగుతుండడంతో సాక్షాత్తూ తహసీల్దార్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. వివరాల ప్రకారం వడ్డిగూడెం గ్రామ శివారు ఆర్‌పీ పాలెంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకుగాను అదే గ్రామానికి చెందిన రాళ్లపల్లి అచ్యుతరావు నుంచి ఎకరం భూమిని, వారి సోదరులకు చెందిన మరికొంత భూమిని ప్రభుత్వం సేకరించింది. గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఆ భూమిలో కొందరు చేపల చెరువు తవ్వేందుకు ఈనెల 11వ తేదీన ఉపక్రమించారు. విషయం తెలిసిన అచ్యుతరావు పెదపాడు పోలీసులకు, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు చేపల చెరువు తవ్వుతున్న పొక్లెయిన్లను బయటకు పంపి తవ్వకాలు నిలుపుదల చేశారు. మా ఎమ్మెల్యేగారు తవ్వుకోమన్నారు.. ఎవరు వచ్చినా తవ్వకాలు ఆపం అంటూ అక్రమార్కులు బదులివ్వడంతో జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ చెరువు తవ్వకం ఆగకపోగా, కూటమి నాయకుల అండదండలతో చెరువు తవ్వకం పూర్తి చేశారని అచ్యుతరావు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి అని ఎలాంటి చర్యలు చేపట్టరాదని బోర్డు పెట్టినా.. ఆ బోర్డును తొలగించి మరీ తవ్వకాలు చేపట్టారంటూ వాపోయారు. దీంతో పెదపాడు తహసీల్దార్ కూడా పోలీసులకు రాత పూర్వకమైన ఫిర్యాదు చేసి సంబంధిత కాపీలను ఉన్నతాధికారులకు నివేదించారు.
చేపల చెరువుల కోసం అక్రమంగా తవ్వకాలు
ఇళ్ల స్థలాల కోసం ఆ భూమి సేకరణ
అక్రమ తవ్వకాలపై పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు
చేపల చెరువు తవ్విన భూమి ప్రభుత్వ భూమి. అక్కడ చెరువు తవ్వకూడదని చెప్పినా రాత్రి సమయాల్లో తవ్వకాలు చేశారు. దీంతో సంబంధిత వ్యక్తులపై పెదపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాను. వీఆర్వోకు షోకాజ్ నోటీస్ జారీచేశాం.
– ఏ కృష్ణ జ్యోతి,
పెదపాడు తహసీల్దార్


