షూటింగ్ సందడి
పాలకొల్లు సెంట్రల్ : హరి గాడి హరికథ చిత్రం షూటింగ్ రెండో రోజు స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో జరిగింది. శనివారం ఆలయం వెనుక భాగంలో మాంటెజ్ సాంగ్‌లో భాగంగా నటీనటులపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. సురభి ఎంటర్‌టైన్‌మెంట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నూతనంగా హరి యడ్లపల్లి, ప్రియా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నూతన దర్శకుడు, రచయిత వైవీ సర్వేష్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఏలూరు(మెట్రో)/ భీమవరం (ప్రకాశం చౌక్): రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులపై జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారులు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని ఒత్తిడి చేయడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్ర రాజు శనివారం ఒక ప్రకటనలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రెవెన్యూలో అనేక విధులతో వీఆర్వోలు ఇబ్బందులు పడుతూ ఉంటే, గ్రామ, వార్డు, సచివాలయల అధికారులు ఇచ్చిన సర్వేలు, బయోమెట్రిక్, ఇతర ఆదేశాలు అమలు చేయాలని ఒత్తడి చేయడం తగదన్నారు. సమస్యలపై ఈ నెల 19న రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లామని, 24న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఉన్నత అధికారులను మంత్రి ఆదేశించారన్నారు. అయినా అధికారుల ఒత్తిడులు ఆగడం లేదన్నారు. సమస్యల పరిష్కారంపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. ప్రకటన విడుదల చేసిన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలనాయుడు ఉన్నారు.
పాలకొల్లు సెంట్రల్ : ఉచితం అని ఆర్టీసీ బస్ ఎక్కితే ఓ మహిళకు చెందిన 12 గ్రాముల బంగారు ఆభరణం పోయింది. శనివారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి కందరవల్లి వెళుతున్న బస్‌లో జనం కిటకిటలాడారు. పాలకొల్లు నుంచి అడవిపాలెం వరకూ వెళ్లవలసిన వరలక్ష్మి అనే మహిళ టికెట్ కోసం ఆధార్ కార్డు తీయడానికి తన హ్యాండ్ బ్యాగ్‌ను ఓపెన్ చేసింది. బ్యాగ్‌లో ఉండాల్సిన కాసున్నర ఆభరణం కనిపించలేదు. వెంటనే డ్రైవర్ బస్సును నేరుగా పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లగా పోలీసులు ప్రయాణికుల బ్యాగ్‌లన్నీ తనిఖీ చేయించారు. ఎవరి వద్ద బంగారం దొరకకపోవడంతో వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


