మహిళ హత్యకేసును ఛేదించిన పోలీసులు
బుట్టాయగూడెం: మర్లగూడెం అటవీప్రాంతంలో జరిగిన మహిళ హత్యకేసును పోలవరం సబ్ డివిజన్, జీలుగుమిల్లి సర్కిల్ పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. నిందితుడు యడ్లపల్లి గణేష్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. శనివారం బుట్టాయగూడెం పోలీస్ స్టేషన్‌లో జీలుగుమిల్లి సీఐ వెంకటేశ్వరరావు వివరాలను వెల్లడించారు. బుట్టాయగూడెం మండల పరిధిలోని మర్లగూడెం అటవీప్రాంతంలో ఈనెల 24న గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యా కోణంలో దర్యాప్తు చేశారు. మృతురాలు నల్లజర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన పామర్తి శిల్పారాణి(25)గా గుర్తించారు. భర్త వెంకటేశ్వరరావు మరణించడంతో శిల్పారాణి తన స్వగ్రామం కొయ్యలగూడెం మండలం సరిపల్లిలో తల్లిదండ్రుల వద్ద నివసిస్తోంది. ప్రస్తుతం జంగారెడ్డిగూడెం పాతబస్టాండ్ సమీపంలో ఉన్న దళితవాడలో నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తోంది. కొయ్యలగూడెం మండలం రామానుజపురంనకు చెందిన యడ్లపల్లి గణేష్ అనే యువకుడు, మృతురాలికి మధ్య ఉన్న వ్యక్తిగత తగాదాల కారణంగా ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకువచ్చి తలపై కర్రతో మోది హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని సీఐ చెప్పారు. మృతదేహం వద్ద ఆధారాలు లభించకపోయినా సాంకేతిక ఆధారాలతో కేసు చేధించామన్నారు. కేసును ఉన్నతాధికారుల సహకారంతో త్వరితగతిన చేధించిన బుట్టాయగూడెం ఎస్సై డి.దుర్గామహేశ్వరరావు, జీలుగుమిల్లి ఎస్సై, సిబ్బంది తదితరులను ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు అభినందించారన్నారు.


