అటవీ ప్రాంతంలో జామాయిల్ చెట్ల నరికివేత
కుక్కునూరు: అటవీ భూముల్లో చెట్లకు రక్షణ కరువైంది. అటవీశాఖ నిర్లక్ష్యం మూలంగా అటవీ భూముల్లోని జామాయిల్ చెట్లను కొందరు వ్యక్తులు అడ్డగోలుగా నరికివేసి వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని అమరవరం అటవీరేంజ్ పరిధిలోని కొండపల్లి గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో జామాయిల్ చెట్లను నరికేసి తరలించినట్లు సమాచారం. గతంతో ఇదే రేంజ్ పరిధిలో అటవీప్రాంతంలోని మారుజాతి కలపను, మాధవరం టేకు ప్లాంటేషన్‌లోని టేకు చెట్లను కొందరు వ్యక్తులు నరికి తరలించికెళ్లినట్టు ఆరోపణలొచ్చాయి. అంతేకాక ఇదే రేంజ్ పరిధిలో అటవీభూముల్లో జామాయిల్ నర్సరీలను నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలా అటవీప్రాంతంలో అక్రమాలు, ఆక్రమణలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
ఉంగుటూరు: మండలంలోని సీతారామపురం గ్రామంలో చేపలు చెరువుల వద్ద కాపలా ఉండే జల్లూరి జనార్దన్ (30) చేపలకు వేసే గ్యాస్ బిళ్లలు మింగి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ తెలిపిన వివరాల ప్రకారం నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామానికి చెందిన జల్లూరి జనార్దన్ కుటుంభసబ్యులతో కలసి సీతారామపురం ఆయకట్టులో చేపలు చెరువులు మీద కాపలాదారుడిగా ఉంటున్నాడు. మద్యానికి బానిసైన జనార్దన్ కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నానంటూ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో చేపలకు వేసే గ్యాస్ బిళ్లలను మింగేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ జనార్దన్ చనిపోయాడు. ఈ మేరకు ఎస్సై సూర్య భగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చాట్రాయి: మండలంలోని నరసింహారావుపాలెం పీఏసీఎస్‌లో గురువారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు షట్టరు తాళాలు పగలకొట్టి బీరువాలో ఉన్న రూ.1.80 లక్షలు ఎత్తుకుపోయారు. శుక్రవారం ఉదయం స్వీపర్ చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై రామకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలను సేకరించింది. ఈ మేరకు ఘటనపై విచారణ చేస్తున్నామని ఎస్సై రామకృష్ణ పేర్కొన్నారు.


