వైఎస్సార్‌సీపీ క్యాలెండర్ ఆవిష్కరణ
నరసాపురం: పేరుపాలెం సౌత్ గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ఉంగరాల పాణీకృష్ణ ముద్రించిన పార్టీ 2026 క్యాలెండర్‌ను శుక్రవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో రెట్టించిన ఉత్సాహంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ఎండగడుతూ ప్రజలకు అండగా నిలబడాలని చెప్పారు. నియోజకవర్గం మొత్తం క్యాలెండర్లు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ బీసీ సెల్ జిల్లా కార్యదర్శి పాలా రాంబాబు, నియోజకవర్గ యూత్ విభాగం అధ్యక్షుడు చినిమిల్లి చందు, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు కొడెల్లి వెంకట్రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కొల్లాబత్తుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
కొత్త కమిషనర్‌గా వెంకట్రామరెడ్డి
నరసాపురం: అవినీతి ఆరోపణలు, కౌన్సిల్‌తో విభేధాల నేపథ్యంలో నరసాపురం మున్సిపల్ కమిషనర్ ఎం.అంజయ్యను ఎట్టకేలకు బదిలీ చేశారు. ఆయనను అనంతపురం మున్సిపల్ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆయన స్థానంలో గతంలో నూజివీడు కమిషనర్‌గా పనిచేస్తూ సీడీఎంఏ కార్యాలయానికి సరెండర్ అయిన వెంకట్రామరెడ్డిని నియమించారు. అంజయ్య ఏడాదిన్నర క్రితం పుట్టపర్తి నుంచి నరసాపురం వచ్చారు. తొలిరోజు నుంచే ఆయన తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. నవంబర్‌లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో కమిషనర్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాజకీయ అండదండలు ఉండటంతో ఆయనపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరిగింది.
భీమవరం(ప్రకాశంచౌక్): జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చదలవాడ నాగరాణిని భీమవరం కొత్త డీఎస్పీ రఘువీర్ విష్ణు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రఘువీర్‌కు అభినందనలు తెలిపారు. భీమవరం డివిజన్‌లో లా అండ్ ఆర్డర్ అమలు, ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోనున్న చర్యలను వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ నెల రోజులు పండుగ వాతావరణం ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని, అన్ని విధాలుగా నిఘా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఏలూరు (టూటౌన్): ఇన్–సర్వీస్‌లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు రెండేళ్లలోపు టెట్ పరీక్ష పాస్ కావాలన్న నిబంధనపై ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం ఏలూరు జిల్లా శాఖ పేర్కొంది. ఈ మేరకు డీఈవోకు శుక్రవారం మెమోరాండం స్పందించారు. ఈ నిబంధనను వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని డీఈవోని కోరారు. ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలని, లేదా ఈ నిబంధనను పూర్తిగా ఉపసంహరించాలని, అందుకోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని సంఘం ప్రభుత్వాన్ని కోరింది. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బేతాళ సుదర్శనం, సహా అధ్యక్షుడు అంగుళూరు సర్వేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు కాకర్ల దొరబాబు, కోశాధికారి కుర్మా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ క్యాలెండర్ ఆవిష్కరణ


