తణుకులో సద్దుమణిగిన ఫ్లెక్సీ వివాదం
తణుకు అర్బన్: వైఎస్సార్ విగ్రహం వద్ద చంద్రబాబు ఫ్లెక్సీ కట్టిన వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగింది. తణుకు వై.జంక్షన్ ప్రాంతంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు అనంతరం ఏర్పడిన ఉద్రిక్తత పరిస్థితుల్లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అక్కడ వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రానికి రెండు ఫ్లెక్సీలు తీసేస్తామని చెప్పిన పోలీసులు గురువారం తెల్లవారుజామునే రెండు ఫ్లెక్సీలు తీసేశారు. దీంతో శుక్రవారం గొడవ సద్దుమణిగింది. ఆ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అధికారులు తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశారు. వైఎస్సార్ విగ్రహం వద్ద జరుగుతున్న ఘటనపై తణుకు వాసులు సైతం ముక్కున వేలేసుకున్నారు. వైఎస్సార్ విగ్రహం వద్ద చంద్రబాబు ఫ్లెక్సీ కట్టడమేంటని చర్చించుకుంటున్నారు. తణుకులో గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


