నలుగురు అధికారులపై వేటు
రక్షణ వలయంలో ప్రత్తిపాడు ప్రతిమాంబ ఆలయం
పెంటపాడు: ప్రత్తిపాడు–ఆరుగొలను రోడ్డులో జెడ్పీ భూముల్లో ప్రతిమాంబ సమేత సదాశివ స్వామి ఆలయ శివాలయ నిర్మాణం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీని వల్ల కొన్ని ప్రాంతాలకు నీరు వెళ్లడంలేదనే కారణంతో ఆలయ నిర్మాణం నిలిపివేయాలని కోరుతూ కొందరు హైకోర్టులో కేసు వేశారు. గుడి నిర్మాణం కొనసాగిస్తూ ఇటీవల విగ్రహాలు ప్రతిష్టించిన విషయం కలెక్టర్ దృష్టికివ వెళ్లింది. కలెక్టర్ నాగరాణికి తెలియడంతో పెంటపాడు మండలంలో నలుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పెంటపాడు తహసీల్దార్ రాజరాజేశ్వరి, గ్రామ కార్యదర్శి పి.నాగేశ్వరరావు, ఈవోపీఆర్డీ ప్రసాద్, ఇన్‌చార్జి వీఆర్వో ఉమాదేవిని సస్పెండ్ చేశారు. డీఎల్‌డీవో ప్రభాకరావు, గూడెం ఆర్డీవోలకు మెమో జారీ చేశారు. గూడెం రూరల్ సీఐ, పెంటపాడు ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. జెడ్పీ భూమిలో గ్రామస్తులు చందాలు వేసుకొని శివాలయ నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణం వల్ల తమకు ఇబ్బంది కలుగుతోందని, మంచినీరు రావడం లేదని గ్రామస్తులు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ భూమిని పరిరక్షించే క్రమంలో నిర్మాణం చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 5న కోర్టు ధిక్కరణ కేసు విచారణకు రానున్న నేపథ్యంలో కలెక్టర్ అధికారులను సస్పెండ్ చేసారు. శుక్రవారం ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హైకోర్టు ఉత్తర్వులు అమలులో ఉన్నందున జనవరి 6 వరకు ఎవరూ శివాలయ ప్రాంతానికి రాకూడదని, గుమి కూడవద్దని, మతపరమైన కార్యక్రమాలు చేయవద్దని ఆర్డీవో నోటీసులు అంటించారు.


