యూరియాకు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి
భీమవరం: జిల్లాలో దాళ్వా సీజన్‌కు అవసరమైన యూరియా నిల్వలు సొసైటీలు, ఆర్‌ఎస్‌కె, ప్రైవేట్ డీలర్స్ వద్ద అందుబాటులో ఉన్నాయని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ నుంచి ఎరువుల లభ్యత, వినియోగం, క్షేత్రస్థాయి సమస్యలు, రైతుల సందేహాల నివృత్తిపై వ్యవసాయ శాఖ అధికారులు, రైతులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించిన సందర్బంగా ఆయన మాట్లాడారు. యూరియాకు ఎమ్మార్పీ ధర కంటే అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. సొసైటీలు, ఆర్‌ఎస్‌కేల్లో రాబోయే 20 రోజులకు సరిపడా యూరియా నిల్వ అందుబాటులో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
భీమవరం (ప్రకాశంచౌక్):కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మొగల్తూరు మండలం పెద్దమైనవానిలంక గ్రామాన్ని ఈనెల 28న సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని కలెక్టర్ నాగరాణి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో మాట్లాడుతూ.. కవిటంలో నిర్మించిన దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం, అనంతరం పెద్దమైన వానిలంక వద్ద సముద్రపు కోతకు గురవుతున్న ప్రాంతంలో రూ.13.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న అడ్డుకట్ట పనులను పరిశీలించనున్నారని చెప్పారు. డ్రోన్, ఏఐ నైపుణ్య శిక్షణ తరగతులు ప్రారంభిస్తారన్నారు. కాగా కాలువ గట్లు, రోడ్డు మార్జిన్లు అక్రమించుకొని గుళ్ళు, విగ్రహాలు ఏర్పాటును అనుమతించవద్దని కలెక్టర్ సూచించారు.
ఆగిరిపల్లి: మండలంలోని పోతవరప్పాడు మ్యాంగో బే కల్చర్ అసోసియేషన్‌లో ఆదివారం పోలీసులు దాడిలో పట్టుబడిన 281 మందిని డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఐదు బస్సులలో తరలించి నూజివీడు కోర్టులో హాజరు పర్చారు. స్వాధీనం చేసుకున్న రూ.32 లక్షలను కోర్టుకు అప్పగించారు. జడ్జి ఆదేశాల మేరకు వారికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఏలూరు (మెట్రో): గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం, ఇతర సమస్యలపై అధికారులతో కలెక్టరు కె.వెట్రిసెల్వి మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ జిల్లా పర్యటనలో లేవనెత్తిన అంశాల విషయంలో నూరుశాతం లక్ష్యాలు సాధించాలన్నారు. మోదెల గ్రామ ప్రజల కోరిక ప్రకారం బుట్టాయిగూడెం మండలంలోకి మోదెల గ్రామాన్ని కలిపేందుకు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. రెడ్డిగూడెం, రాజానగరం, కోటరామచంద్రపురంలో సెల్ ఫోన్లు సిగ్నల్స్ లేవని ఫిర్యాదులు వస్తున్నాయని, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సెల్ టవర్స్ రిపేర్లు ఉంటే చేయించి, కొత్తగా అవసరమైన చోట టవర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి కార్యక్రమాలకు భూసేకరణలో భూమికి భూమి ఇవ్వాలని, అర్హత ఉన్నవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జాబు మేళా ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని అన్నారు. హెల్త్ సబ్ సెంటర్లకు 108 వాహనం వెళ్ళేలా రహదారుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు.
ఏలూరు (మెట్రో): ఎరువులు పంపిణీ, ఎరువులు, విత్తనాల నాణ్యతపై వ్యవసాయాధికారులతో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మంగళవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయాధికారులు వారి పరిధిలో కావలసిన ఎరువులు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, ప్రస్తుత వ్యవసాయ సీజన్లో జిల్లాలోని రైతులకు ఎరువుల కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. రానున్న 10 రోజులకు అవసరమైన ఎరువులు నిల్వ ఉండేలా చూసుకోవాలన్నారు.


