ఉత్సాహంగా పోలీస్ స్పోర్ట్స్ మీట్
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా వార్షిక పోలీస్ స్పోర్ట్స్ మీట్ ఉత్సాహకర వాతావరణంలో సాగింది. మూడు రోజులపాటు పోలీసు అధికారులు, సిబ్బంది ఉల్లాసంగా వివిధ పోటీల్లో తమ సత్తా చాటారు. మంగళవారం రాత్రి పోలీస్ స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకల్లో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ హాజరుకాగా, జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానం పలికారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు పోలీస్ సబ్ డివిజన్ అధికారులు, ఆర్మ్‌డ్ రిజర్వ్ క్రీడాకారులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయా క్రీడా పోటీల్లో విజేతలకు ఐజీ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీల్లో ఓవరాల్ చాంపియన్‌గా జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ సిబ్బంది, ఓవరాల్ సింగిల్ చాంపియన్‌గా ఏఆర్ కానిస్టేబుల్ కిషోర్ ఎంపికయ్యారు. జిల్లా ఎస్పీ, ఏలూరు రేంజ్ ఐజీ టగ్ ఆఫ్ వార్‌లో పాల్గొని సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపారు. ఐజీ మాట్లాడుతూ నిత్యం తీవ్రమైన పని ఒత్తిడిలో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. నేటి ఆధునిక విధానంలో ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవటంతో చిన్న వయస్సులోనే గుండెపోటు వ్యాధులకు బలికావటం బాధాకరమని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఖర్చు లేని వ్యాయామం నడకను ఎంచుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది ఎంతో ఒత్తిడితో విధులను నిర్వర్తిస్తుంటారని, క్రీడా పోటీలు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వానికి దోహదం చేస్తాయని చెప్పారు. అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు ఎఎస్పీ సుస్మిత, ఏఆర్ అదనపు ఎస్పీ జీ.మునిరాజా, డీఎస్పీలు శ్రావణ్‌కుమార్, వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పోలీస్ స్పోర్ట్స్ మీట్


