ముస్తాబవుతున్న శ్రీవారి ఆలయ ఉత్తర ద్వారాలు
క్షేత్రంలో ఊపందుకున్న ముక్కోటి ఏర్పాట్లు
ద్వారకాతిరుమల: ముక్కోటి ఏకాదశి పర్వదినం దగ్గర పడటంతో క్షేత్రంలో శ్రీవారి ఉత్తర ద్వారదర్శనానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. అందులో భాగంగా ఆలయ ఉత్తర ద్వారాలను ముస్తాబు చేసే పనులు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. యంత్రాల సహాయంతో ద్వారాలను సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. అలాగే ఆలయ ప్రాకారంలో విద్యుద్దీప అలంకారాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్ వెనుక ప్రాంతంలో నిర్మించిన తాత్కాలిక క్యూలైన్లకు రంగులు వేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 30న ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారి ఉత్తర ద్వార దర్శన భాగ్యం భక్తులకు కలగనుంది. ముందురోజు 29న మధ్యాహ్నం 2.30 గంటలకు తొలిమెట్టు (పాదుకా మండపం) వద్ద గిరి ప్రదక్షిణ ప్రారంభం అవుతుందని ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. గిరి ప్రదక్షిణ అనంతరం రాత్రి 7 గంటల నుంచి భక్తులకు స్వామివారి నిజరూప దర్శనాన్ని కల్పిస్తామన్నారు. ఉత్తర ద్వార దర్శనానికి ప్రత్యేక రూ.500 టికెట్లను అందుబాటులో ఉంచుతామన్నారు.
ఆలయ ప్రాకారంలో విద్యుద్దీప అలంకారాల పనులు
ఉత్తర ద్వారాలను ముస్తాబు చేస్తున్న సిబ్బంది
ముస్తాబవుతున్న శ్రీవారి ఆలయ ఉత్తర ద్వారాలు


