అన్ని సేవలూ ఆన్‌లైన్‌లోనే
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న దర్శనార్ధం ఆలయానికి విచ్చేసే భక్తులకు దేవస్థానం అధికారులు గత శనివారం నుంచి అన్ని ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. అందులో భాగంగా ఆలయ తూర్పు ప్రాంతంలోని మొబైల్ కౌంటర్ సమీపంలో తాత్కాలికంగా టెంటు వేసి, అందులో ఓ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. రెండు కంప్యూటర్లు, రెండు ప్రింటర్ల ద్వారా భక్తులకు సిబ్బంది ఆన్‌లైన్ సేవలను అందిస్తున్నారు. కొందరు భక్తులు ఇప్పటి వరకు కేవలం వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్ సేవలను పొందారు. తాజాగా ఫోన్‌పే, గూగుల్‌పే వంటి ఆన్‌లైన్ సేవలను భక్తులకు చేరువ చేశారు. పారదర్శకమైన, వేగవంతమైన సేవలను భక్తులకు అందించడానికి ఆన్‌లైన్ సేవలను మరింత విస్తృతం చేయాలని ఇటీవల రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ దేవాలయాల అధికారులకు సూచించారు. ఈ క్రమంలోనే చిన్నతిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు.
ఇప్పుడు అన్నీ సేవలూ.. మనమిత్రా వాట్సప్ (9552300009) నెంబర్‌కు హాయ్ అని పంపి ఆలయంలో అన్ని సేవలను పొందొచ్చు. అలాగే www. aptemples.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా, ఏపీ టెంపుల్ మొబైల్ యాప్ ద్వారా శ్రీవారి దర్శనం, ప్రత్యక్ష – పరోక్ష సేవలు, ప్రసాదాలు ఇతర ఆన్‌లైన్ సేవలను సులభంగా పొందొచ్చని అధికారులు చెబుతున్నారు. ఆన్‌లైన్, మనమిత్ర వాట్సప్ ద్వారా టికెట్లు పొందిన భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శన సదుపాయం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
విశేష స్పందన : ప్రస్తుతం అధిక శాతం మంది ప్రజలు ఫోన్‌పే, గూగుల్‌పేను ఎక్కువగా వాడుతున్నారు. మార్కెట్‌లో ఏ చిన్న వస్తువు కొన్నా.. వాటి ద్వారానే చెల్లింపులు జరుపుతున్నారు. శ్రీవారి ఆలయంలో కూడా ఈ సేవలు మొదలవడంతో ఆన్‌లైన్ సేవలకు విశేష స్పందన లభిస్తోంది. అధిక శాతం మంది భక్తులు రూ.100, రూ.200 దర్శనం టికెట్లతో పాటు, నిత్యార్జిత కల్యాణం, అంతరాలయ దర్శనం రూ.500 టికెట్లు, ప్రసాదం, వసతి టికెట్లను ఆన్‌లైన్ ద్వారా పొందుతున్నారు. గోపూజ, కుంకుమార్చన, గరుడసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు, సహస్రదీపాలంకరణ సేవ, స్నపన టికెట్ల విక్రయాలు ఆన్‌లైన్ ద్వారా తక్కువగా జరుగుతున్నాయి. ఆన్‌లైన్ సేవలు ఎలా పొందాలి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను భక్తులకు కౌంటర్‌లోని సిబ్బంది వివరిస్తున్నారు.
శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు
నగదు చెల్లింపుల నిమిత్తం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్న సిబ్బంది
శ్రీవారి ఆలయ తూర్పు ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆన్‌లైన్ సేవల కౌంటర్
అన్ని సేవలూ ఆన్‌లైన్‌లోనే


