ఆర్టీసీ పెట్రోల్ బంకులో అవినీతిని వెలికితీయాలి
ఏలూరు (టూటౌన్): ఏలూరు ఆర్టీసీ పెట్రోల్ బంకులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం మాట్లాడారు. ఏలూరు ఆర్టీసీ పెట్రోల్ బంకులో అవినీతి జరిగితే గుట్టు చప్పుడు కాకుండా ఏలూరు డిపో మేనేజర్‌తో సహా తొమ్మిదిమంది నుంచి రూ.50 లక్షలకు పైగా వసూలు చేసి ఏవిధమైన చర్యలు లేకుండా కప్పిపుచ్చాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు పత్రికల్లో వార్తలు రావడం బాధాకరం అన్నారు. డబ్బులు తిరిగి చెల్లిస్తే దోషులపై చర్యలు ఉండవా అని ఆయన ప్రశ్నించారు. ఎస్.డబ్ల్యూ.ఎఫ్ రాష్ట్ర నాయకునిపై కక్ష సాధింపుతో వేటు వేస్తూ తప్పు చేయలేదని నికరంగా నిలబడ్డ మరో ముగ్గురు ఉద్యోగులపై కూడా వేటు వేయడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండించింది. ఈ కుంభకోణం వెనుక అసలు సూత్రధారులు ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వెంటనే సస్పెన్షన్ చేసిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని, ఆర్టీసీ పెట్రోల్ బంక్ లో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని రవి డిమాండ్ చేశారు.
కఠినంగా శిక్షించాలి
జంగారెడ్డిగూడెం వసతి గృహంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేసి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి


