ప్రమాదవశాత్తూ చెరువులో మునిగి విద్యార్థి మృతి
ఆకివీడు: తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్న ఓ విద్యార్థి పశువులు కడుగుతూ ప్రమాదవశాత్తూ చెరువులో మునిగి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన ఆకివీడు మండలంలోని పెద్ద కాపవరం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కటారి దుర్గాప్రసాద్, పార్వతీ దంపతులకు కుమారుడు సందీప్ (21), కుమార్తె ఉన్నారు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న సందీప్ కౌలు రైతుగా జీవిస్తున్న తండ్రి దుర్గాప్రసాద్‌కు అన్ని పనుల్లో చేదోడు, వాదుడోగా ఉండేవాడు. సందీప్ శనివారం పశువులను కడుగుతూ చెరువులో ప్రమాదవశాత్తూ మునిగి దుర్మరణం పాలయ్యాడు. సందీప్‌ను బాగా చదవించాలని ఆశ పడ్డామని, ఇంతలోనే మృత్యువు కబళించిందని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు కాలేదు.


