మాక్ అసెంబ్లీ ఎంపికలో రాజకీయాలు!
పారదర్శకంగా ఎంపిక
● ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం
● రాజకీయ నేతల సిఫార్సులతో ఎంపికలంటూ ఆరోపణలు
● అంతా పారదర్శకమే అంటున్న డీఈఓ
భీమవరం: విద్యార్థులకు రాజ్యాంగం, హక్కులపై అవగాహన, రాజకీయాలపై ఆసక్తి కలిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మాక్ అసెంబ్లీ రాజకీయ ప్రమేయంతో గందరగోళంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తాయి. మాక్ అసెంబ్లీకి ఎంపిక చేసే విద్యార్థులను ప్రతిభతో కాకుండా రాజకీయ పైరవీలతో ఎంపిక చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భగా మాక్ అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే రాష్ట్రస్థాయిలో అమరావతిలో మాక్ అసెంబ్లీ నిర్వహణకు ప్రతి నియోజకవర్గం నుంచి ఒక విద్యార్థిని ఎంపిక చేసే బాధ్యత విద్యాశాఖకు అప్పగించింది. ఈ మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ వంటి పోటీలు నిర్వహించారు. స్కూల్ స్థాయిలో ప్రతిభ చూపిన ముగ్గురిని మండల స్థాయికి, అక్కడి నుంచి ముగ్గురిని నియోజకవర్గ స్థాయికి అక్కడ అత్యంత ప్రతిభ చూపిన ఒక విద్యార్థిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేయాలి. ఇలా జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఏడుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీలో పాల్గొంటారు.
రాజకీయ పైరవీలతో..
అమరావతిలో నిర్వహించే మాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేల మాదిరిగా విద్యార్థులు వ్యవహరిస్తూ ఆయా ప్రాంతాల సమస్యలపై మాట్లాడాల్సి ఉంటుంది. అయితే విద్యార్థుల ఎంపికలో రాజకీయాలు చోటుచేసుకున్నాయని, అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కాకుండా కొందరు రాజకీయ నేతల సిఫార్సులతో ఎంపికలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ ప్రమేయంతో ఎంపికలు జరిగితే చిన్నతనంలోనే విద్యార్థులకు రాజకీయ కుట్రలు, కుతంత్రాలు, అవినీతిని అలవాటు చేసినట్టు అవుతుందని తల్లిదండ్రుల ఆవేదన చెందుతున్నారు.
అమరావతిలో ఈనెల 26న నిర్వహించే మాక్ అసెంబ్లీ లో పాల్గొనే విద్యార్థుల ఎంపిక అంతా పారదర్శకంగా జరిగింది. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రతిభ కనబర్చిన ముగ్గురు విద్యార్థుల జాబితా రాష్ట్రస్థాయికి పంపించాం. అక్కడ విద్యార్థుల ప్రతిభ, హాజరు వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గం నుంచి ఒక్క రిని ఎంపిక చేశారు. ఎంపిక విషయంలో స్థా నికుల ప్రమేయం ఎంతమాత్రం లేదు.
–ఈ.నారాయణ,
జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం
మాక్ అసెంబ్లీ ఎంపికలో రాజకీయాలు!


