చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
● రోడ్డుపై గుంతలే ప్రమాదానికి కారణం
● సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు
ద్వారకాతిరుమల: మండలంలోని సూర్యచంద్రరావుపేట శివారులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి, రోడ్డు పక్కనున్న తోటలోకి దూసుకెళ్లి కొబ్బరి చెట్టును ఢీకొట్టింది. శనివారం మద్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ప్రయాణికులు, భక్తులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డుపై ఉన్న గోతులే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు ఆర్టీసీ డిపోకి చెందిన పల్లెవెలుగు బస్సు విజయవాడ నుంచి ద్వారకాతిరుమలకు వెళుతుండగా మార్గమధ్యంలో ఘటనా స్థలం వద్ద రోడ్డుపై ఉన్న గోతులను తప్పించేందుకు ఓ కారు అకస్మాత్తుగా ఎడమ పక్కకు తిరిగింది. దీంతో వెనుక వస్తున్న బస్సు కారును తప్పించే క్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న తోటలోకి దూసుకెళ్లి కొబ్బరి చెట్టును ఢీకొట్టింది. బస్సులో 56 మంది ప్రయాణికులు తీవ్ర భయందోళనకు గురయ్యారు. స్థానికులు బస్సు అత్యవసర ద్వారాన్ని తెరిచి ప్రయాణికులను బయటకు దించారు. ఒకరిద్దరికి స్వల్ప గాయాలు కాగా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఏలూరు ప్రజా రవాణా శాఖ అధికారి ఎస్‌కే షబ్నం ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ప్రయాణికులను మరో బస్సులో ద్వారకాతిరుమలకు పంపారు.
రోడ్డుపై గోతులే కారణం : సూర్యచంద్రరావుపేట శివారులోని మలుపులో ఉన్న గోతుల వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. బైక్‌లపై క్షేత్రాలకు వెళ్లే భక్తులు ప్రమాదాలబారిన పడుతున్నారు. కార్లు, ఇతర వాహనాలు గోతుల్లో పడి ధ్వంసమవుతున్నాయి. దీంతో పంచాయతీ సిబ్బంది ఈ ప్రాంతంలో సూచికగా ఒక ఎరుపు రంగు పరుపును కర్రల సహాయంతో నిలబెట్టారు. కారు ఈ సూచికను తప్పించే క్రమంలోనే బస్సు ప్రమా దం జరిగింది. రోడ్డును పునర్నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు


