రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం
తాడేపల్లిగూడెం: అన్నదాత సుఖీభవ కింద పూర్తి సాయం అందించకుండా, కొంత సొమ్ము విదిలించి రాష్ట్రంలోని రైతులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం, ఆక్వా కల్చర్ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాం ధ్వజమెత్తారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల హామీలో ప్రతి రైతుకూ పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు ఇస్తామని ప్రకటించి తొలి ఏడాది ఎగ్గొట్టారన్నారు. రెండో ఏడాది అమలు చేసినా రాష్ట్రంలో 7 లక్షల మందికి కోత విధించారన్నారు. అయినా పూర్తి సాయం చేసినట్టు ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో ఐదేళ్లలో రాష్ట్రంలో మొత్తంగా 53,58,366 మందికి రూ.34,378 కోట్ల సాయం అందించారన్నారు. అ లాగే అప్పట్లో కౌలు రైతులకూ న్యాయం చేయగా, ప్రస్తుత చంద్రబాబు సర్కారు మొండిచేయి చూపిందన్నారు. ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం సుమా రు రూ.21 వేల కోట్ల సాయం అందించాల్సి ఉండ గా కేవలం రూ.4,685 కోట్లు మాత్రమే ఇచ్చారని, మిగిలిన రూ.16 వేల కోట్లకు పైగా బాకీ పడ్డారన్నారు.
ఆక్వా రైతులకూ..
ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్ రాయితీ కింద రూ.1.50లు ఇస్తామన్న ప్రభుత్వం వర్తింపజేసే విషయంలో దొంగదారులు వెతుకుతోందని రఘు రాం విమర్శించారు. ఆక్వా జోన్, నాన్ ఆక్వాజోన్ అంటూ, రిజిస్ట్రేషన్లు, మార్గదర్శకాల పేరిట రాయి తీ ఎగ్గొట్టేలా ప్రవర్తిస్తోందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఆక్వా రైతులకు అన్యాయం చేయాలని చూస్తే వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ ఆదేశాలతో ఉద్యమానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ రుణాలు, కనీస మద్దతు ధర కోసం స్థిరీకరణ నిధి, ఈ–క్రాప్ విధానం, ఇన్‌ఫుట్ సబ్సిడీ వంటి సంక్షేమ పథకాలకు మంగళం పాడిన ఘనత చంద్రబాబు సర్కారుకే దక్కుతుందన్నారు. ప్రభుత్వ విధానాలు రైతుల పాలిట శాపంలా మారాయన్నారు.


