కుష్టు వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా..
జీరో కేసు నమోదే లక్ష్యం
● ఇంటింటి సర్వే చేపట్టిన వైద్య సిబ్బంది
● జిల్లా వ్యాప్తంగా 1,390 టీంలతో సర్వే
● మందులు వాడుతున్న 42 కేసులు, 1,535 అనుమానిత కేసుల గుర్తింపు
భీమవరం (ప్రకాశం చౌక్): జిల్లాలో కుష్టు (లెప్రసీ) వ్యాధిని కట్టడి చేసేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు ఈనెల 17 నుంచి ఇంటింటి సర్వే చేపట్టారు. వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి అనుమానిత కేసులను నమోదు చేసి నిర్థారణ పరీక్షలకు సిపార్సు చేస్తున్నారు. ఈ సర్వే ఈనెల 30వ తేదీ వరకూ జరగనుంది. జిల్లాలో 1,395 టీంలు లెప్రసి సర్వే చేస్తూ ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఒక్కో టీంలో ఆశా వర్కర్ తోపాటు మేల్ వలంటీర్ ఉంటారు. ఇప్పటివరకు 6 వేల ఇళ్లు సర్వే చేసి దాదాపు 2,56,909 మందికి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేశారు.
కుష్టు అంటువ్యాధి కాదు
కుష్టు అంటువ్యాధి కాదని, సకాలంలో గుర్తించి చికిత్స చేస్తే త్వరితగతిన అదుపు చేయవచ్చని వైద్యాధికారులు చెబుతున్నారు. వ్యాధి బారిన పడిన విషయం నలుగురికి తెలిస్తే ఇబ్బందిగా ఉంటుందనే భయంతో చాలా మంది ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం, శరీరంపై వచ్చే మచ్చలు గురించి తెలియకపోవడం, అవగాహన లేకపోవడంతో వ్యాధి ముదిరిపోయే ప్రమాదం ఉంది. శరీరంపై వచ్చే సర్శ లేని రాగి మచ్చలు ఉంటే వెంటనే వైద్యులకు చూపించుకొవాలని నిర్లక్ష్యం చేయరాదని వైద్యులు చెబుతున్నారు. 2022–23 సంవత్సరంలో 96, 2023–24లో 133, 2024–25లో 89 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో నిర్వహిస్తున్న సర్వేలో ఇప్పటివరకు 42 కొత్త కేసులు గుర్తించగా 1535 అనుమానిత కేసులు గుర్తించారు. పాత కేసులు జిల్లాలో 633 ఉన్నాయి. మందులు వాడుతున్న 42 కేసుల్లో మల్టి బ్యాసిలరి(ఎంబి) కేసులు 15, పాసివ్ బ్యాసిలరీ(పీబీ) 27 కేసులు ఉన్నాయి.
వ్యాధి లక్షణాలు
● చర్మంపై స్పర్శ లేని రాగి రంగు మచ్చలు. చెవులపై బుడిపెలు, కణుతులు, నరాల తిమ్మిర్లు.
● మందమైన మెరిసే జిడ్డుగల చర్మం
● కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం.
● కనురెప్పలు మూత పడకపోవడం.
● చేతులు, కాళ్లలో బొబ్బలు రావడం.
● చేతి, కాలివేళ్లు వంకర్లు తిరిగి అంగవైకల్యం రావడం.
● కాళ్ల చెప్పులు జారిపోవడం
● చల్లని, వేడి వస్తువులను గుర్తించలేకపోవడం.
● పాదాలు, మడమల్లో వాపు.
● ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి రక్తం కారడం.
చికిత్స విధానం
కుష్టు వ్యాధికి రెండు పద్ధతుల్లో చికిత్స అందిస్తారు. శరీరంపై మూడు మచ్చలు ఉన్నవారికి పాసివ్ బ్యాసిలరీ (పీబీ) విధానంలో ఆరు నెలల పాటు చికిత్స అందిస్తారు. ఐదు మచ్చలకు పైబడి ఉన్నవారికి మల్టీ బ్యాసిలరీ (ఎంబీ) విధానంలో 12 నెలల చికిత్స అందిస్తారు. దీనిలో భాగంగా నెలకు ఒకసారి మందులు రోగుల ఇళ్లకు వెళ్లి వైద్య సిబ్బంది అందిస్తారు. సర్వేలో గుర్తించిన రోగులకు సకాలంలో వైద్యం అందజేయడంతోపాటు ఆ వ్యాధిపై వారికి, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తారు. బహుళ ఔషధ చికిత్స (మల్టీ డ్రగ్ థెరపీ) ద్వారా వ్యాధిని అరికడుతున్నారు. వ్యాధికి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా మందులు అందిస్తున్నారు.
2027 నాటికి కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని, జీరో కేసు నమోదువాలని లక్ష్యంతో ప్రతి ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నాం. ప్రజలు కూడా దీనికి సహకరించాలి. ప్రారంభ దశలో మచ్చలను గుర్తిస్తే కుష్టుని పూర్తిగా నిర్మూలించవచ్చు. అశ్రద్ధ చేస్తే అంగవైకల్యం రావచ్చు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని బహుళ ఔషధ చికిత్స ద్వారా పూర్తిగా కుష్టుని నిర్మూలించవచ్చు. స్పర్శ లేని రాగి రంగి మచ్చలు చెమట పట్టని మచ్చలు ఉన్నా వెంటనే సమీప ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలి.
– డాక్టర్ రవిబాబు, జిల్లా కుష్టు నిర్మూలన అధికారి, భీమవరం
కుష్టు వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా..
కుష్టు వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా..


