నిర్మల భక్తికి ఫలం.. పోలి స్వర్గం
నెల రోజుల ఫలం
నిడమర్రు: హరిహరులకు ఇష్టమైన కార్తీకమాసం ఎన్నో రకాలుగా విశిష్టమైనది. ఈ మాసంలో ప్రతి రోజు పుణ్యప్రదమని పురాణాలు చెబుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న శివకేశవ ఆలయాల్లో ఈ నెలంతా దైవారాధనలూ, దీపారాధనలూ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అయితే ‘పోలి స్వర్గం’ తెలుగువారికే ప్రత్యేకం. నిర్మలమైన భక్తికి, నిస్వార్థ దీపారాధనకూ ఉన్న ప్రాధాన్యాన్ని ఈ సంప్రదాయం చాటి చెబుతుంది. గురువారంతో కార్తీక మాసం పూజలు ముగిశాయి. గురువారం మధ్యాహ్నం అమావాస్య ముగియడంతో మార్గశిర పాడ్యమి ప్రారంభమైంది. దీంతో శుక్రవారం తెల్లవారు జామున పోలి స్వర్గానికి సాగనంపేందుకు మహిళా భక్తులు సిద్ధమయ్యారు.
ముగింపులో దీపారాధన
ఈ మాసం ముగింపు సందర్భంగా వత్తులతో దీపాలను వెలిగిస్తారు. అలాగే భగవంతుని ముందు ఉసిరికాయలపై దీపాలను వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది. కార్తీక అమావాస్య నాడు మహిళలు వేకవజామునే లేచి స్నానాధులు ముగించి దేవాలయాల్లో పూజలు చేసి అనంతరం పోలిని సర్వానికి పంపే వేడుకను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఆరటి దొప్పలతో దీపాలను వెలిగిస్తారు. వాటిని సమీపంలో ఉన్న నదిలో, చెరువులో లేదా ఇతర జనవనరుల్లో వదిలి పెడతారు. ఆ అవకాశం లేని వారు ఇంట్లోనే పళ్లాలలో నీరు పోసి, వాటిలో దీపాలు విడిచి పెడతారు. పోలిని లక్ష్మీ స్వరూపంగా ఆరాధిస్తారు. కాబట్టి కార్తీక అమావాస్య రోజుకు బదులు ఆ మరుసటి రోజు, అంటే మార్గశిర శుద్ధ పాడ్యమినాడు పోలి పేరిట దీపాలను వెలిగిస్తారు. పోలి కథను చెప్పుకుంటూ శుక్రవారం వేకువజాము నుంచి ఆ దీపాలను నీటిలో వదులుతారు.
కార్తీకమాసం నెలంతా దీపాలు వెలిగించడం పుణ్యప్రదం. అయితే అలా చేయలేనివారు. ఈ రోజు 30 వత్తులతో దీపాల్ని వెలిగించి, నీటిలో విడిచిపెడితే, నెల రోజులూ దీపాలు వెలిగించిన ఫలితం వస్తుందని స్కంద పురాణంలో పేర్కొన్నారు. అలాగే దీపాలనూ, స్వయం పాకాన్నీ దానం చేయడం వలన విశేష ఫలం లభిస్తుందంటారు.
– తిరుమల శేషాచలం, అర్చకులు, నిడమర్రు
ముగిసిన కార్తీక మాసోత్సవం
పోలిని స్వర్గానికి సాగనంపేందుకు సిద్ధమైన భక్తులు
నేడు శివకేశవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు
నిర్మల భక్తికి ఫలం.. పోలి స్వర్గం
నిర్మల భక్తికి ఫలం.. పోలి స్వర్గం


