శ్రీవారి క్షేత్రంలో హడావుడిగా స్వచ్ఛత పనులు
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో గురువారం ఆగమేఘాలపై స్వచ్ఛత పనులు చేపట్టారు. సాక్షి దినపత్రికలో ‘ఖర్చు అరకోటి.. స్వచ్ఛత మాటేంటి’ శీర్షికతో గురువారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై కలెక్టర్ కె.వెట్రిసెల్వి స్పందించారు. పారిశుద్ధ్య పనులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉంటే ఉదయాన్నే పారిశుద్ధ్య కార్మికులు ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలోని శ్రీవారి దీపారాధన మండపాన్ని శుభ్రం చేసే పనులు చేపట్టారు. సెక్షన్ సూపరింటెండెంట్ ఐవీ రామారావు దగ్గరుండి పనులు చేయించారు. మద్యాహ్నం నుంచి అనివేటి మండపాన్ని, మండపంలోని దేవతామూర్తుల విగ్రహాలను ఒక మెషీన్ ద్వారా హడావిడిగా శుభ్రం చేసే పనులు నిర్వహించారు. అయితే వాటిని శుభ్రం చేసేందుకు సక్రమంగా సోపాయిల్ వినియోగించక పోవడం వల్ల, కడిగిన విగ్రహాలు తడి ఆరిన తరువాత మళ్లీ దుమ్ముతో కనిపించాయి. మెషీన్ సామర్థ్యం చాలక మండప పైభాగాలను కూడా సరిగ్గా కడగలేక పోయారు. దాంతో విగ్రహాలపైన, మండప పైభాగాల్లో ఎక్కడ దుమ్ము.. అక్కడే ఉంది. చంద్రబాబు సర్కారు లక్షలాది రూపాయలను కాంట్రాక్టర్లకు దోచిపెడుతూ, పారిశుద్ధ్యాన్ని గాలికొదిలేసిందని పలువురు విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే పారిశుద్ధ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను రెండు రోజుల్లోగా అందిస్తామని కలెక్టర్‌కు ఆలయ అధికారులు సమాదానం ఇచ్చినట్టు తెలిసింది. అలాగే రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌కు దీనిపై వాస్తవ పరిస్థితులను లేఖ ద్వారా తెలిపినట్టు సమాచారం. ఇక పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (తిరుపతి) సంస్థకు నోటీసు జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం.
శ్రీవారి క్షేత్రంలో హడావుడిగా స్వచ్ఛత పనులు
శ్రీవారి క్షేత్రంలో హడావుడిగా స్వచ్ఛత పనులు


