బంగారం చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
భీమవరం: బంగారం చోరీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి వివరాలు వెల్లడించారు. ఈనెల 17వ తేదీన భీమవరం పట్టణం టిడ్కో కాలనీకి చెందిన కణితి అంజనేయప్రసాద్ బంగారు నగల తయారీ షాపులో పనిచేస్తున్నాడు. షాపు యజమాని ఆదేశాలతో నరసాపురం పట్టణంలోని జైన్ గోల్డ్‌షాపులో ఇచ్చేందుకు బంగారు ఆభరణాలను తీసుకువెళుతున్నాడు. 125 గ్రాముల బంగారు వడ్డాణం, 10 గ్రాముల ఆరు బంగారు లాకెట్స్ ఫ్యాంట్ జేబులో పెట్టుకుని ఆర్టీసీ బస్ ఎక్కుతుండగా నగలు అపహరణకు గురయ్యాయి. వెంటనే వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సీఐ ఎం నాగరాజు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. టెక్నికల్, క్రైమ్ బృందంతో బస్ కాంప్లెక్స్‌లోని సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించి అనుమానితులను గుర్తించారు. ఈనెల 19వ తేదీన భీమవరం రైల్వే జంక్షన్ స్టేషన్ పరిసరాల్లో ఏలూరు జిల్లా నూజివీడు కొత్తపేటకు చెందిన బంకురు కుమార్, అజరాయి పేటకు చెందిన మలుగుమాటి సుభాష్‌ను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.15 లక్షల విలువైన బంగారు అభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ కేసును కేవలం 48 గంటల్లో ఛేదించిన వన్‌టౌన్ సీఐ ఎం నాగరాజు, ఎస్సై మోహన్‌వంశీ, క్రైమ్‌పార్టీ హెడ్ కానీస్టేబుల్ యెహోసువా, కానిస్టేబుల్ జి రామకృష్ణ, అడ్డాల శ్రీనులను అభినందించి రివార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో అడిషినల్ ఎస్పీ వి భీమారావు తదితరులు పాల్గొన్నారు.


