రైతులపై పగ.. సుఖీభవలో దగా
58 వేల మందికి సాయంలో కోత
సాక్షి ప్రతినిధి,ఏలూరు: చంద్రబాబు ప్రభుత్వం అన్నదాతలకు మళ్లీ శఠగోపం పెట్టింది. సూపర్ సిక్స్–సూపర్ హిట్ అంటూ ఊరూవాడా వేల సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హడావుడి చేసిన సర్కారు రైతులకు రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇచ్చేశామని స్వయం ప్రకటన చేసుకుంది. అయితే ఇచ్చింది రెండు విడతల్లో రూ.14 వేలే. అది కూడా ఎంపిక చేసిన రైతులనే రీతిలో కొందరికే పరిమితమై జిల్లాలో 58 వేల మంది సాగుదారులకే, సుమారు లక్షకు పైగా కౌలురైతులకు ఎగనామం పెట్టింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా పేరుతో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా ల్లో మొత్తంగా 3,22,824 మందికి రైతుభరోసా అందిస్తే చంద్రబాబు సర్కారు మాత్రం 2,64,729 మందికి అందజేసినట్టు ప్రకటించింది.
‘సూపర్’ మోసం
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో ప్రతి రైతుకు రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తామని ప్రకటించింది. అధికారంలోకి రాగానే విజయవంతంగా మొదటి సంవత్సరం ఎగనామం పెట్టి రైతులను నిట్టనిలువునా మోసం చేసింది. 18 నెలల కాలంలో జిల్లాలో మూడుసార్లకు పైగా గోదావరి వరదలు, తుపాను దాటికి పంట నష్టం వాటిల్లినా ఒక్క రూపాయి పరిహారం ఇవ్వకపోగా కేంద్ర సాయంతో కలిపి ఇచ్చే అన్నదాత సుఖీభవలో కూడా భారీగా కోతలు విధించి రైతులను నిలువునా మోసం చేస్తుంది. పూర్తి వ్యవసాయ ఆధారిత జిల్లాలో సర్కారు వంచనకు రైతులు ప్రతి సీజన్‌లోనూ మోసపోతూనే ఉన్నారు. ఎన్నికల ప్ర చారంలో చెప్పేది ఒకటి ఆచరణలో, క్షేత్రస్థాయిలో చేసేది ఒకటిగా ఉంది. పెట్టుబడి సాయం రూ.20 వేల చొప్పున ఏలూరు జిల్లాలోనే రైతులకు రూ.471.69 కోట్లు, పశ్చిమగోదావరిలో రూ.220 కోట్లకుపైగా ఇవ్వాల్సి ఉంది. అయితే మొదటి సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టారు. ఇక రెండో సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లో లబ్ధిదారుల సంఖ్యను భారీ గా తగ్గించేశారు. గత ప్రభుత్వ హయాంలో 2023– 24లో ఏలూరు జిల్లాలో 1,98,179 మంది రైతులకు రూ.236.99 కోట్లు పెట్టుబడి సాయం రైతుభరోసా పేరుతో అందించారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో 1,24,645 మందికి రూ.168.17 కోట్లు అందించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలు వు దీరిన తర్వాత ఈ ఏడాది ఏలూరు జిల్లాలో 1,60,968 మందికి రూ.106.23 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 1,03,761 మందికి రూ.68.97 కో ట్లు జమ చేశారు. దీనిలో పీఎం కిసాన్ పథకం ద్వా రా రూ.4 వేలు అందగా మిగిలిన రూ.10 వేలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
జగన్ సర్కారులో రైతులకు అగ్రస్థానం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అన్నదాత సంక్షేమానికి పెద్దపీట వేశారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో నాలుగేళ్లు కలిపి పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పేరుతో రూ.50 వేలు అందిస్తామని ప్రకటించి క్షేత్రస్థాయిలో రూ.67,500 జమచేసి ఆదుకున్నారు. గత ప్రభుత్వంలో ఏలూరు జిల్లాలో మొత్తంగా రూ.1830.24 కోట్లు రైతు భరోసా, రూ.22.29 కో ట్లు సున్నా వడ్డీ పేరుతో మంజూరు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని విడతలు కలిపి రూ.796.41 కోట్లు రైతులకు జమచేశారు.
మరోసారి వంచన
అన్నదాత సుఖీభవ సాయంలో కోతలు
అర్హుల జాబితాను కుదించిన సర్కారు
జిల్లాలో 58 వేల మంది రైతులకు మొండిచేయి
తొలి ఏడాది రూ.471 కోట్లు ఎగనామం
మోంథా తుపాను బాధితులకూ అందని సాయం
కౌలు రైతుల సంక్షేమం పట్టని ప్రభుత్వం
ఈకేవైసీ లేదని, రికార్డుల్లో తేడాలున్నాయని, బ్యాంకులో నమోదు కాలేదని ఇలా పలు కారణాలతో చంద్రబాబు ప్రభుత్వం జిల్లాలో 58,098 మంది రైతులకు సాయంలో కోత విధించింది. ఇస్తామన్న రూ.20 వేలలో ఇచ్చేది రూ.14 వేలు అందులోనూ వేలాది మందికి కోత విధించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక అధికారంలోకి రాగానే కౌలురైతులకు గుర్తింపు కార్డులిచ్చి అదుకుంటామని ప్రకటించిన సర్కారు కౌలురైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడంతో ఉమ్మడి జిల్లాలో సుమారు లక్ష మంది రైతులు ఎటువంటి పథకాలూ అందక ఇబ్బంది పడుతున్నారు.
రైతులపై పగ.. సుఖీభవలో దగా


