శుభకరం.. శివయ్య దర్శనం
ద్వారకాతిరుమల: క్షేత్రపాలకునిగా విరాజిల్లుతున్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో శివయ్యకు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, లక్ష బిళ్వార్చన, జ్యోతిర్లింగార్చనను మంగళవారం కన్నుల పండువగా నిర్వహించారు. కార్తీక మాసం, అందులోనూ మాసశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలను అత్యంత వైభవంగా జరిపారు. ముందుగా ఆలయ గర్భాలయంలో కొలువైన శివయ్యకు అర్చకులు, పండితులు మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ మహన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని, మద్యాహ్నం లక్ష బిళ్వార్చనను నిర్వహించారు. రాత్రి ఆలయ మండపంలో జ్యోతిర్లింగార్చనను జరిపారు. శివలింగాకారంలో ఏర్పాటు చేసిన దీపాలను భక్తులు ఎంతో భక్తిప్రపత్తులతో వెలిగించారు.
ప్రత్యేక అలంకరణలో సోమేశ్వర స్వామి
భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం గునుపూడి గ్రామంలో వేంచేసియున్న శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన స్వామివారిని సుమారు 6 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. దర్శనం, అభిషేకం టికెట్లు ద్వారా రూ.86 వేలు, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.4 వేలు కలిపి మొత్తం ఆదాయం రూ.90 వేలు వచ్చినట్లు ఆలయ కమిటీ తెలిపింది. స్వామివారి నిత్యాన్న దానం ట్రస్ట్ నందు కానుకల రూపంలో రూ.42 వేల ఆదాయం వచ్చినట్లు చెప్పారు.
బలే రామస్వామికి లక్ష బిళ్వార్చన
ముసునూరు: కార్తీకమాసం, మాస శివరాత్రి కావడంతో బలివే మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి మంగళవారం అంగరంగ వైభవంగా రుద్రాభిషేకం, లక్ష బిళ్వార్చన నిర్వహించారు. ఏలూరు వర్తక సంఘ ప్రతినిధులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక సహిత లక్ష బిళ్వార్చన నిర్వహించి, రుద్ర హోమం, జ్యోతిర్లింగార్చన చేశారు. భక్తులు దేవస్థాన ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మకంటి శ్యామలరావు, ఈఓ పామర్తి సీతారామయ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం ఐదు వేల మంది భక్తులకు తొమ్మిది రకాల తీర్థ ప్రసాదాల వితరణ గావించారు.
మంచు కొండల్లో క్షీరారామలింగేశ్వరస్వామి
పాలకొల్లు సెంట్రల్: కార్తీకమాసం పురస్కరించుకుని మంగళవారం పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు వీరబాబు స్వామివారిని మంచుకొండల్లో శివయ్యలా అలంకరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించి తరించారు. మాస శివరాత్రి సందర్భంగా ఆలయ అభిషేక పండిట్ భమిడపాటి వెంకన్న బ్రహ్మత్వంలో స్వామివారికి లీలా కల్యాణం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో 16 మంది దంపతులు పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ మీసాల రాము, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
శుభకరం.. శివయ్య దర్శనం
శుభకరం.. శివయ్య దర్శనం
శుభకరం.. శివయ్య దర్శనం
శుభకరం.. శివయ్య దర్శనం


