ఉప్పులూరు.. జ్వరాలతో బేజారు
● సర్వేలో 30 మంది జ్వర పీడితుల గుర్తింపు
● వైద్య శిబిరం నిర్వహిస్తున్న అధికారులు
ఉండి: ఉండి మండలం ఉప్పులూరు గ్రామం జ్వరాలతో అల్లాడిపోతుంది. పదుల సంఖ్యలో జ్వరపీడితులు ఆసుపత్రుల బాట పట్టడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తులు గత కొద్దిరోజులుగా జ్వరాల బారినపడుతున్నా పెద్దగా ఎవ్వరూ లెక్కచేయలేదు. అయితే జ్వరపీడితులు రోజురోజుకు పెరిపోవడంతో పాటు ప్లేట్‌లెట్లు పడిపోయి ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని రోగులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో మంగళవారం గ్రామంలో యండగండి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది డాక్టర్ బెన్నీ సామ్యూల్, ఐసీ కీర్తన ఆధ్వర్యంలో వైద్య బృందం నిర్వహించారు. వైద్య సిబ్బందితో పాటు ఆశావర్కర్ల బృందం గ్రామంలో ఇంటింటికీ తిరిగి జ్వరాల సర్వే నిర్వహించడంతో 30 మంది రోగులను గుర్తించినట్లు వారు తెలిపారు. వీరికి సాధారణ జ్వరాలేనని తేల్చగా డెంగీ జ్వర అనుమానితులుగా గుర్తించిన ఇద్దరి శాంపిల్స్‌ను మాత్రం తాడేపల్లిగూడెం పరీక్ష నిమిత్తం పంపించినట్లు డాక్టర్ తెలిపారు. సర్వేలో జ్వర పీడితులు 30 మంది మాత్రమే గుర్తించినా ప్రైవేటు ఆసుపత్రుల బాట పట్టిన వారు అంతకంటే ఎక్కువమంది ఉన్నారని, కొందరు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ వైద్య శిబిరాన్ని ఎంపీడీవో శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీవో సీఎస్‌వీ రెడ్డి, జిల్లా మలేరియా అధికారి వీ క్రాంతి, జిల్లా ఎపీస్టోమలాజిస్ట్ సుభాష్, మలేరియా యానిట్ అధికారి ఏఎస్‌ఎస్‌ఎన్ మూర్తి పరిశీలించి ప్రజలకు అందుతున్న వైద్యంపై ఆరాతీసారు.
పారిశుద్ధ్య లోపమే కారణమా?
గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంతో జ్వరాలు వ్యాపించాయని వైద్య సిబ్బంది చెబుతుండగా గ్రామంలోని మంచినీటి చెరువులో నీరు రంగు మారిందని, ఆ నీటిని తాగి ప్రజలు జ్వరాలబారిన పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే మంగళవారం నీటిపరీక్షలు నిర్వహించామని, తాగునీటిలో ఎటువంటి ఇబ్బంది లేదని పరీక్షల్లో తేలిందని ఎంపీడీవో కే శ్రీనివాస్ స్పష్టం చేశారు.


