పొగాకు బోర్డు అధికారుల క్షేత్ర పర్యటన
జంగారెడ్డిగూడెం: నారుమడి పెంపకంలో శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని వర్జీనియా పొగాకు బోర్డు ఆర్‌ఎం జీఎల్‌కే ప్రసాద్ రైతులకు సూచించారు. మంగళవారం జంగారెడ్డిగూడెం టుబాకో బోర్డు ప్లాట్ ఫామ్ 32 పరిధిలో చిన్నవారిగూడెం గ్రామంలో వర్జీనియా పొగాకు బోర్డు అధికారులు క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. రీజనల్ మేనేజర్ జీఎల్‌కే ప్రసాద్ ఆధ్వర్యంలో తిరుమలశెట్టి రవికి చెందిన పొగ నారు నర్సరీని సందర్శించి నారుమడి పెంపకం, సాగు విధానాలపై అవగాహన కల్పించారు. అనంతరం రైతులు రీజనల్ మేనేజర్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ హర్ష, రైతులు బుద్ధాల సత్యనారాయణ, మాదాసు సత్యనారాయణ, బుద్దాల రాజు, పొనగంటి ముత్తయ్య, బండారు వీరస్వామి, దాకవరపు వెంకటేశ్వరరావు, బండారు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నూజివీడు: తాళాలు వేసి ఉన్న సెల్‌ఫోన్ షాపులో దొంగతనం చేసిన నిందితుడిని చాట్రాయి పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ పట్టణంలోని సీఐ కార్యాలయంలో మంగళవారం వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీ రాత్రి చాట్రాయి ప్రధాన సెంటర్‌లో ఉన్న సెల్‌ఫోన్ షాపు తాళం, తలుపు పగలగొట్టి లోపల ఉన్న సెల్‌ఫోన్‌లను, నగదును దొంగతనం చేశారు. దీంతో షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాట్రాయి ఎస్సై డీ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమేరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు టెక్నాలజీని ఉపయోగించి ఈనెల 17న వచ్చిన సమాచారం మేరకు చాట్రాయి నుంచి పోలవరం వెళ్లే రోడ్డులో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి దాదాపు రూ.2 లక్షల విలువైన సెల్‌ఫోన్‌లను రికవరీ చేశారు. నిందితుల్లో ఒకరు ఏలూరులోని పాములదిబ్బ ప్రాంతానికి చెందిన ముంగి సాగర్ కాగా మరో వ్యక్తి మైనర్ బాలుడు. నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ, ఎస్సై డీ రామకృష్ణ, ఇతర సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
పొగాకు బోర్డు అధికారుల క్షేత్ర పర్యటన


