గొర్రెల వధ వ్యవహారం.. నేతల బేరం!
అత్తిలి: అత్తిలి మేకల కబేళాలో చనిపోయిన గొర్రెలను వధించి మాంసాన్ని విక్రయిస్తున్న వ్యవహారాన్ని ఇటీవల పంచాయతీ అధికారులు దాడి చేసి గుట్టురట్టు చేసిన సంగతి తెలిసిందే. గత నెల 30న అత్తిలి కబేళాలో చనిపోయిన గొర్రెలను వధించి మాంసాన్ని తరలించడానికి సిద్ధపడుతున్న సమయంలో పంచాయతీ అధికారులు దాడిచేసి మాంసాన్ని, చనిపోయిన గొర్రెలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారితో పాటు మరో ముగ్గురిపై కూడా అత్తిలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. గత కొన్నేళ్లుగా చనిపోయిన, వ్యాధిసోకిన గొర్రెలను ఈ కబేళాలో వధించి మాంసాన్ని పరిసర ప్రాంతాలలో తక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం పశువైద్యులు, పంచాయతీ అధికారులు పర్యవేక్షణలో గొర్రెలు, మేకలను వధించాల్సి ఉండగా పంచాయతీలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ లేకపోవడంతో మేకలు, గొర్రెలను వధించే సమయంలో స్టాంపు వేసే ప్రక్రియ జరగడంలేదు. దీంతో కొందరు మాంసం విక్రయదారులు అడ్డగోలుగా నిర్జీవంగా ఉన్న గొర్రెలను వధించి మాంసాన్ని విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల చనిపోయిన గొర్రెలను వధించిన వ్యవహారం జరిగిన అనంతరం లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు వినిపిస్తోంది. మాంసం దుకాణదారుల తరుఫున లక్షలాది రూపాయలను సమకూర్చి కూటమి నాయకులకు, అధికారులకు ముట్టజెప్పినట్లు బాహాటంగా పేర్కొంటున్నారు. దీని వెనుక ఆంతర్యం ఏమిటని ప్రజలు గుసగులాడుకుంటున్నారు.
లక్షలాది రూపాయలు చేతులు మారాయని గుసగుసలు


