తవ్వేయ్.. తరలించేయ్
● ఇరిగేషన్ చెరువులో గ్రావెల్ తవ్వకాలు
● అడ్డుకున్న రైతులపై దౌర్జన్యం
● పట్టించుకోని అధికారులు !
సాక్షి, టాస్క్‌ఫోర్స్: భీమడోలు మండలం పొలసానిపల్లిలోని చందుబోణం మైనర్ ఇరిగేషన్ చెరువులో రెండు రోజులుగా గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. శనివారం రాత్రి నుంచి భారీ పొక్లయిన్లతో గ్రావెల్‌ను తవ్వి తరలిస్తుండగా ఆయకట్టు రైతులు అడ్డుకున్నా అక్రమార్కులు పట్టించుకోలేదు. ఆదివారం పట్టపగలే గ్రావెల్ తవ్వుతుండగా రైతులు మరోమారు అడ్డుకున్నారు. భారీ గుంతలతో తమ పొలాలకు పెను ప్రమాదం తప్పదని రైతులు నిలదీశారు. వీరిపై అక్రమార్కులు దౌర్జన్యానికి దిగారు. గ్రావెల్ తవ్వకాలకు పంచాయతీ తీర్మానం చేసి ఇచ్చారని సుధీర్ అనే వ్యక్తి రైతులతో వాగ్వాదానికి దిగాడు. తీర్మానం చూపించాలని రైతులు నిలదీస్తే.. మీరే వెళ్లి పంచాయతీ నుంచి అడిగి తెలుసుకోండని అడ్డగోలుగా మాట్లాడాడు. అధికారులు, కూటమి నాయకుల సహకారంతోనే మట్టి మాఫియా చెలరేగిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఉప సర్పంచ్ అంబటి నాగేంద్రప్రసాద్ గ్రావెల్ తవ్వకాలపై వీడియో తీసి అధికారులకు పంపించారు. దీంతో వీఆర్వో ఇక్కడకు వచ్చి పొక్లయిన్‌తో తవ్వకం పనులను నిలిపివేయించి మట్టి మాఫియాను హెచ్చరించారు. అయితే పొక్లయిన్‌ను సీజ్ చేయలేదు.
అభివృద్ధి పనుల సాకుగా..
పొలనానిపల్లిలో అభివృద్ధి పనులకు గ్రావెల్‌ను వినియోగించుకునేలా గతంలో పంచాయతీ తీర్మానం చేసింది. దీనిని సాకుగా చూపి చందుబోణం చెరువులో గ్రావెల్‌పై మాఫియా కన్నేసి తవ్వకాలు చేపట్టింది. దీనిపై పంచాయతీ, రెవెన్యూ అధికారుల దృష్టికి రైతులు తీసుకువెళ్లగా అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే సంబంఽధిత అధికారులు పొంతలు లేని సమాధానం చెబుతున్నారు. దీనిపై గ్రామ కా ర్యదర్శి జయరామకృష్ణను వివరణ కోరగా తమ ప్రమేయం లేదని, గ్రామంలో గ్రావెల్ తరలింపుపై పంచాయతీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. అభివృద్ధి పనులకు తప్ప ఇతరులు గ్రావెల్ తీసుకువెళితే ఊరుకోబోమన్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యను వీఆర్వోకు తెలిపి చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.
భారీ గుంతలతో ప్రమాదం
వీఆర్వో గ్రావెల్ తవ్వకాల ప్రాంతానికి వచ్చి పంచ నామా చేసి పొక్లయిన్‌ను ఎందుకు సీజ్ చేయలేదని మాజీ ఉప సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నేత అంబటి నాగేంద్రప్రసాద్ ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో భారీ గుంతలతో చెరువు సహజ స్వరూపం కోల్పోతుందని, నీరు పెట్టినా నీరంతా కిందకు ఇంకుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు భూగర్భ జలాలు తగ్గిపోతుంటే, ఇప్పుడు నీరు పెట్టేందుకు ఆస్కారం లేకుండా గ్రావెల్ మాఫియా చెలరేగిపోతుందని, అధికారులు వీరికి సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు.


