నాన్ అకడమిక్ అంశాలు తగ్గించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయులపై ఒత్తిడికి కారణమవుతున్న నాన్ అకడమిక్ అంశాలు పూర్తిగా తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆపస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఆదివారం స్థానిక సేవాభారతి కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. అఖిల భారతీయ ఉపాధ్యాయ సంఘం జాతీయ కార్యదర్శి జి.లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో జాతీయ భావాలను పెంపొందించాలని సూచించారు. జాతీయ విద్యా విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ సత్యనారాయణ మాట్లాడుతూ పరీక్షా విధానాల్లో మార్పులు అవసరమన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన 100కు పైగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆయా సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలాజీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాధ్యుడు క్రొవ్విడి రాజకుమార్, జిల్లా అధ్యక్షుడు సీహెచ్ సతీష్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.


