చిన్న తిరుపతిలో భక్తుల రద్దీ
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రంలో శనివారం భక్తులు పోటెత్తారు. శ్రీవారికి ప్రీతికరమైన రోజూ అందులోనూ కార్తీకమాసంలో ఆఖరి శనివారం, ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తుల గోవింద నామస్మరణలతో స్వామి సన్నిధి మారుమోగింది. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలోని దీపారాధన మండపంలో, అలాగే ఎదురుగా ఉన్న చెట్ల వద్ద భక్తులు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించారు. వేలాది మంది భక్తులు కల్యాణకట్టలో స్వామివారికి మొక్కులు చెల్లించారు. అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నిత్యాన్నదాన సదనం ఇతర విభాగాల్లో భక్తుల రద్దీ కనిపించింది. ఆలయ ఆవరణలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది.


