చివరికి చిక్కాడు
ఏడేళ్లుగా పరారీలో నిందితుడు
భీమడోలు: హత్య కేసులో ఏడేళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని భీమడోలు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు సమీపంలోని డోకుపర్రుకు చెందిన గూడవల్లి స్టీవెన్ అలియాస్ శ్రీనుని పట్టుకుని కోర్టులో హాజరుపర్చారు. భీమడోలు సీఐ యూజే విల్సన్, ఎస్సై మదీనా బాషా తెలిపిన వివరాల ప్రకారం.. 2017లో ఏలూరు సత్రంపాడు ఎంఆర్‌సీ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ పెదపల్లి దుర్గారామ్ ప్రసాద్ (21)ను స్టీవెన్, అతడి తండ్రి, సోదరుడు కలిసి పూళ్ల సమీపంలోని చెరుకు తోటలో హత్య చేశారు. ఆటోను అపహరించుకుని పరారయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా కరోనా సమయంలో స్టీవెన్ తండ్రి, సోదరుడు మృతి చెందారు. అయితే ప్రధాన నిందితుడు స్టీవెన్ ఏడేళ్లుగా పోలీసులకు కనిపించకుండా, సాక్ష్యాలను సైతం మాయం చేస్తూ పరారీలో ఉన్నాడు. 2018 నుంచి కోర్టు వాయిదాలకు కూడా హాజరుకావడం లేదు. ఈ కేసును జిల్లా ఎస్సీ కె.ప్రతాప్ శివకిషోర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సీఐ విల్సన్, ఎస్సై మదీనా బాషా, హెచ్‌సీ సూరిశెట్టి శ్రీనివాస్, కానిస్టేబుల్ జె.సురేష్‌తో ప్రత్యేక బృందాన్ని నియమించారు. వారు చాకచక్యంగా స్టీవెన్‌ను అదుపులోకి తీసుకుని భీమడోలు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు.


