భీమవరం టీడీపీలో రభస
● పదవులు అమ్ముకున్నారంటూ తోపులాట
● రసాభాసగా ప్రమాణ స్వీకార కార్యక్రమం
భీమవరం: భీమవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సీనియర్లను అవమానిస్తున్నారని, ప్రొటోకాల్ పాటించడం లేదని, ప్రభుత్వ పదవులు అమ్ముకుంటున్నారంటూ ఆరోపణల నేపథ్యంలో నాయకుల మధ్య తోపులాట జరగ్గా సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ మండల కమిటీ, క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్ ప్రమాణస్వీకారం స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో శుక్రవారం ఏర్పాటుచేశారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులను వేదికపైకి పిలిచే సమయంలో వీరవారం ఎంపీపీ వీరవల్లి దుర్గాభవానీ ఫొటో ఫ్లెక్సీలో వేయలేదని, ప్రొటోకాల్ ప్రకారం వేదికపైకి పిలవలేదంటూ గందరగోళం ప్రారంభమైంది. సీనియర్లను అవమానిస్తున్నారంటూ నాయకులు మండిపడ్డారు. అనంతరం మాజీ కౌన్సిలర్ పామర్తి వెంకట్రామయ్య మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పెద్దనాయకులెవ్వరూ రోడ్డుపైకి రాలేదంటూ వ్యాఖ్యానించడంతో పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి ఆయనపై విరుచుకుపడ్డారు. పార్థసారథికి మద్దతుగా కోళ్ల రామచంద్రరావు (అబ్బులు) నిలవగా పార్టీ నాయకులు మధ్య తోపులాట జరిగింది. రాష్ట్ర మహిళా సాధికారిక వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ పీతల సుజాత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు వంటి నాయకులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా నాయకులు శాంతించలేదు. ఇటీవల నియామకాలు జరిగిన పార్టీ పదవులతోపాటు ప్రభుత్వ పదవులను అమ్ముకున్నారంటూ ఆరోపణలతో శ్రేణులు మండిపడ్డారు. పార్టీలో క్రమశిక్షణ లేదని, పదవుల పందేరంతో వన్‌మేన్ షోగా మారిందని నిలదీశారు.


