ఉసురు తీసిన టిప్పర్ లారీ
మహిళ దుర్మరణం
గణపవరం: అతివేగంగా వస్తున్న టిప్పర్ లారీ స్కూటర్‌ను ఢీకొట్టగా మహిళ దుర్మరణం పాలైన ఘటన గణపవరం మండలంలోని వరదరాజపురం శివారులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గురువారం గణపవరంలోని చినరామచంద్రపురానికి చెందిన కొట్టు సత్యనారాయణ, భార్య సత్యవతితో కలిసి యాక్టివాపై బంధువుల ఇంటికి వల్లూరు బయలుదేరారు. మార్గమధ్యలో వరదరాజపురం శివారున అతివేగంగా వెళ్తున్న టిప్పర్ లారీ వీరిని ఓవర్ టేక్ చేయబోయి ఢీకొట్టింది. దీంతో సత్యనారాయణ, సత్యవతి రోడ్డుపై పడిపోగా సత్యవతి పొట్టమీదుగా లారీ వెనుక చక్రాలు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. సత్యనారాయణ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గణపవరం ఎస్సై ఆకుల మణికుమార్ ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రోడ్డుపై గోతుల వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. గణపవరం నుంచి పిప్పర వెళ్లే ప్రధాన రహదారి గోతులమయంగా మారింది. ఇటీవల భారీ వర్షాలకు గోతులు మరింత ప్రమాదకరంగా ఉన్నాయి. వాహనాలు గోతులను తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు స్పందించి తక్షణం గోతులనైనా పూడ్పించాలని పలువురు కోరుతున్నారు.


